‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. అలాగే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మాసివ్ ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు మేకర్స్.
“ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు” అంటూ ‘గబ్బర్ సింగ్’ని మించిన సంచలన విజయాన్ని అందుకోవడానికి పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ద్వయం సిద్ధమవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినీ ప్రియులు సైతం ‘గబ్బర్ సింగ్’ ప్రభంజనాన్ని అంత తేలికగా మర్చిపోలేరు. అందుకే వీరి కలయికలో రెండో సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రకటన రాగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. దానికితోడు ‘గబ్బర్ సింగ్’ సెంటిమెంట్ ని పాటిస్తూ ఆ సినిమా విడుదలైన తేదీ మే 11 కే ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇటీవల మే 11న ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుందని ప్రకటన వచ్చినప్పటి నుంచే ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ, బయటా అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టించారు.
ఈరోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద ఫస్ట్ గ్లింప్స్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. సాయంత్రం 4:59 కి విడుదల చేసిన ఈ ఫస్ట్ గ్లింప్స్ అభిమానులకు అంచనాలకు మించి ఉంది. “ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు ప్రతి యుగమునా అవతారము దాల్చుచున్నాను” అంటూ ఘంటసాల గాత్రంతో భగవద్గీతలోని శ్లోకంతో గ్లింప్స్ ప్రారంభమైంది. “భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, పాతబస్తీ” అంటూ ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ, నుదుటున తిలకంతో జీపులోనుంచి దూకుతూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు కథానాయకుడు పవన్ కళ్యాణ్. కేవలం 40 సెకన్ల వీడియోలోనే తన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్, ఆవేశంతో గూజ్ బంప్స్ తెప్పించారు. “ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోయిద్ది” అంటూ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ముందే చెప్పేశారు. “హుట్ సాలే” అంటూ వింటేజ్ యాటిట్యూడ్ తో పవన్ కళ్యాణ్ పలికిన తీరుకి ఫిదా కాకుండా ఉండలేము. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది.
అభిమానుల సమక్షంలో పండుగలా జరిగిన ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని సతీష్ కోట చేతుల మీదుగా గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “గబ్బర్ సింగ్ మన పదేళ్ల ఆకలి తీరిస్తే.. గబ్బర్ సింగ్ నుంచి భగత్ సింగ్ వరకు ఇది నా 11 ఏళ్ళ ఆకలి. ఈ క్షణం కోసం 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ ఎగ్జైట్ మెంట్ ని ఫ్యాన్స్ తో పంచుకోవాలని, మీ సమక్షంలో గ్లింప్స్ ని విడుదల చేస్తున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకులు దశరథ్, చంద్రమోహన్, నిర్మాత ఎస్.కె.ఎన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ గా అయానంక బోస్, ఎడిటర్ గా చోటా కె. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.