బెంగళూరు: కాంగ్రెస నాయకుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యుటి ఖాదర్ మంగళవారం కర్నాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం స్పీకర్ పోస్టుకు ఎన్నిక లాంఛనప్రాయంగా జరగనున్నది. కర్నాటక అసెంబ్లీకి అత్యంత పిన్నవయస్కుడైన స్పీకర్‌గా ఖాదర్ ఎన్నిక కానున్నారు. అధికార సార్టీ నామినేట్ చేసిన అభ్యర్థి స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సర్వసాధారణం. కర్నాటకలో స్పీకర్ పదవికి ఎన్నిక కానున్న మొదటి ముస్లిం నాయకుడు కూడా ఖదర్ కావడం విశేషం.
గత బిజెపి ప్రభుత్వ కాలంలో అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఖాదర్ కొనసాగారు. తన తండ్రి యుటి ఫరీద్ మరణానంతరం ఖాళీ అయిన ఒకప్పటి ఉల్లాల్ అసెంబ్లీ నియోజకవర్గం(ప్రుస్తుతం మంగళూరు) నుంచి 2007లొ జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి పోటీచేసి యుటి ఖాదర్ గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా ఐదుసార్లు మంగళూరు నియోజకవర్గం నుంచే ఖాదర్ గెలుపొందారు.
2013లో సిద్దరామయ్య ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా, ఆ తర్వాత ఆహార, పౌరసరఫరాల మంత్రిగా ఖాదర్ పనిచేశారు. 2018లో కాంగ్రెస్, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో హౌసింగ్, పట్టణాభివృద్ధి ఖాఖలను ఆయన నిర్వహించారు.