కృష్ణాజలాల్లో రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెట్టిన పాపం
బిఆర్‌ఎస్‌దే 811టిఎంసిలలో299 టిఎంసిలకు అంగీకరించింది నాటి
పాలకులే పదేళ్లు పట్టించుకోని బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ప్రశ్నించడం
విడ్డూరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే బ్రిజేష్ ట్రైబ్యూనల్‌లో
బలమైన వాదనలు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీ నీటి లో తెలంగాణకు 299 టీఎంసీ, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను నాడు టిఆర్‌ఎస్(బిఆర్‌ఎస్) పార్టీ తాకట్టు పెట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో తొలి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన కొన్ని నెలలకే 2015 జూన్‌లో ఆనాటి టీఆర్‌ఎస్ ప్ర భుత్వం ఏపీ ప్రభుత్వంతో వాటాల వినియోగానికి సంబంధించి చీకటి ఒప్పందం చేసుకుందని, దాంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్‌ఎస్
నేతలు ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవచేశారు. కృష్ణా నదీజలాల వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని తొలినుంచి పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్ ఆడిన నాటకాలను అసెంబ్లీలో నిలదీసి తాము శ్వేత పత్రం విడుదల చేసినట్లు తెలిపారు. మొత్తం 811 టీఎంసీల్లో ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతంగా బీఆర్‌ఎస్ ఒప్పుకొని అన్యాయం చేస్తే… కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా రావాలని, ఏపీకి 30 శాతం కేటాయించాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం అని వివరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బ్రిజేష్ ట్రైబ్యూనల్ ద్వారా తొందరగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించిందని, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచిందని, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు ప్రేక్షకపాత్ర వహించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అపెక్స్ మీటింగ్ లకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టింది నిజం కాదా..? గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని బహిరంగంగా కేసీఆర్ అనలేదా ? అని నిలదీశారు.
1978 గోదావరి అవార్డు ప్రకారం… పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది. ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున అక్కడ రావాల్సిన 45 టీఎంసీల నీటి వాటా తెలంగాణకే దక్కాలి కానీ ఎందుకు జరగలేదన్నారు.పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు తెలిపింది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏపీకి తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45టీఎంసీల వాటా దక్కాలి కదా.. అప్పుడే మీరు పట్టుపడితే, నిజంగానే పోరాడితే తెలంగాణ నీటి వాటా 90 టీఎంసీల వరకు పెరిగేది కదా..? ఆ నీటి వాటాలు ఎందుకు తెచ్చుకోలేదు..? అది ఎవరి వైఫల్యం..? అని బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు.