రెండేళ్ళలో ఎస్.ఎల్.బి.సి నీ పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల ,పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు గాను సవరించిన అంచనాలకనుగుణంగా 4,650 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు టన్నెల్ బోరింగ్ మిషన్ కు అమెరికా నుండి అత్యాధునిక యంత్రసామగ్రి కోసం సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వం తరపున అమెరికాలో పర్యటించి వచ్చారన్నారు. గురువారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా వేముల విరేశం,కుంభం అనిల్ రెడ్డి, వి లు బీర్ల ఐలయ్య యాదవ్,ఆది శ్రీనివాస్, మందుల శామ్యూల్, తన్నీర్ హరీష్ రావు,పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేజేశ్వర్ రెడ్డి, పాయల శంకర్,రామారావు పాటిల్ లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిండి ప్రాజెక్ట్ కు కావలసిన నీటి మూలాల పై నెలరోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
బునదిగాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, పిల్లాయిపల్లి కాలువల నిర్మణాల పూర్తికి గాను 294. 18 కోట్లను విడుదల చేస్తూ జీ. ఓ జారీ చేసినట్లు ఆయన సభకు తెలిపారు. ఈ కాలువల నిర్మాణాలు పూర్తి అయితే నకిరేకల్,మునుగోడు, భోనగిరి,ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాలకు చెందిన 66 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. అయిటిపాముల ఎత్తి పోతల పధకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని,అయితే భూసేకరణ చెప్పట్టాల్సి ఉందన్నారు.ఈ ఎత్తి పోతల పధకానికి సంబంధించిన భూసేకరణ బాధ్యత స్థానిక శాసనసభ్యుడు వేముల వీరేశం పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. బ్రాహ్మణవెళ్ళెంల ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వగ్రామమైన బాహ్మణవెళ్ళెంలలో ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. మెయిన్ కాలువలకు అవసరమైన భూసేకరణ కు గాను 37 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
ఐదేళ్ళలో 30 లక్షల కొత్త ఆయకట్టుకు నీరు : కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుందన్నారు. గత ప్రభుత్వం కోటి 81 వేలు ఖర్చు పెట్టి తక్కువ ఆయకట్టును సేద్యంలోకి తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఏ, బి కేటగిరీలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా రూట్ మ్యాప్ రూపొందించుకుందన్నారు. చనాక-కోరాట ఏ కేటగిరీలో పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు పిప్లి ఎత్తిపోతల పధకం పూర్తిచేస్తామని, దేవాదుల పూర్తికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
భూసేకరణ, ప్రాజెక్ట్ వర్క్ లపై పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇదే ప్రాజెక్ కింద స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట ఎత్తిపోతల పథకానికి 160 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు చేపట్టిన గత ప్రభుత్వం భూసేకరణకు నిధులు విడుదల చేయలేదన్నారు. ఆ రిజర్వాయర్ కు సరిపడా భూసేకరణ కోసం 100 కోట్లు అవసరమని కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేసిందన్నారు. గందమల్ల ప్రాజెక్ట్ కు భూసేకరణ సమస్య ఆటంకంగా మారిందని,దానిని దృష్టిలో పెట్టుకుని 1.5 టిఎంసి కెపాసిటీని తగ్గించి మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిఫ్ట్‌లను మరమ్మతులు చేసి పునరుద్దరిస్తామన్నారు. గడ్డెబన్న వాగు లైనింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ నీటి లభ్యత ఉన్న ప్రతి చోట తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ ఎత్తిపోతల పధకాలను రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందన్నారు. గత ప్రభుత్వం మేజర్ ఇరిగేషన్,మీడియం,మైనర్ ఇరిగేషన్ లను కలపడంతో ఓ అండ్ యం లేక అవి నిర్వీర్యంగా మారాయన్నారు. అయితే ఎత్తిపోతల పధకాల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు,రైతులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్స్, ఇతర విద్యుత్ పరికరాలు చోరీ కాబడుతున్నాయన్నారు.దీనితో అటు రైతాంగానికి,ఇటు ప్రభుత్వానికి నష్టదాయకంగా మారిందన్నారు. గడిచిన పదేళ్ళగా అధికారంలో ఉన్న ప్రభుత్వం లిఫ్ట్ లను నిర్లక్ష్యం చేసిందన్నారు.
లిఫ్ట్ ల పరిరక్షణకు చర్యలు ఎక్కడ తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే కాలువలు, లిఫ్ట్ ల పరిరక్షణకు ఏకంగా 1800 లష్కర్ ఉద్యోగ నియమకాలు చేపట్టిందన్నారు. అంతే కాకుండా ఏకంగా 687 ఏ.ఇ. ఇ ఉద్యోగాలను భర్తీ చేసి,మరో 1238 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతించామన్నారు. ఎంపికైన 687 ఏ.ఇ.ఇ లలో వంద మందికి పైగాఐఐఐటి, ఐఐటిలకు చెందిన వారు ఉండడం నీటిపారుదల శాఖకు గర్వకారణమన్నారు. ముఖ్యంగా ప్రాజెక్ట్ ల నిర్మాణాలలో భూసేకరణ సున్నితమైన సమస్యగా మారిందన్నారు. ప్రాజెక్ట్ లు మొదలు పెట్టిన రోజునే భూసేకరణ జరిపి ఉంటే సమస్యలు ఉత్పన్నంఅయి ఉండేది కాదన్నారు.మొదలు ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు పూర్తి చేసి తరువాత భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టడంతో ఈ సమస్య తలెత్తుతుందన్నారు. ఇకపై భూసేకరణ అంశంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలన్నారు.