Thursday, December 19, 2024

ధాన్యం కొనుగోలు ఇంత నిజాయితిగా ఎప్పుడూ జరగలేదు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తాం
రాష్ట్రవ్యాప్తంగా 7,049 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఇప్పటివరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
రైతులు తక్కువ ధరకు పంటను అమ్మొద్దు
ఈ సారి ధాన్యం వేలం ద్వారా రూ.1110.05 కోట్లు
ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన ధాన్యం కొనుగోళ్ల అంశంపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 7,049 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో ఇప్పటికే 6వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయన్నారు.

ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని, గతేడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నిసిగ్గుగా మట్లాడుతున్నారని, గత సంవత్సరం 230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారని ఆయన చెప్పారు. ఇప్పటికే 6,919 కేంద్రాల్లో ధాన్యం కొనుగొళ్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ఎంఎస్‌పి కంటే ఎక్కువ ధరకు ధాన్యం కొంటున్నాం
గతేడాది ఏప్రిల్ 1 నాటికి సిద్ధిపేట జిల్లాలో కేవలం 339 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారని, గతేడాది ఏప్రిల్ 15వ తేదీ నాటికి సిద్దిపేట జిల్లాలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం తెరలేదన్నారు. కానీ, ఈ ఏడాది సిద్ధిపేట జిల్లాలో సోమవారం వరకు 418 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని ఆయన వివరించారు.

ఎంఎస్‌పి కంటే ఎక్కువ ధరకు ధాన్యం కొంటున్నామని, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈ సారి ముందే కొనుగోలు కేంద్రాలు తెరిచామన్నారు. బ్యాంకుల ద్వారా డబ్బులను నేరుగా రైతుల అకౌంట్లలో వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువ రేటు అమ్మాల్సిన అవసరం లేదని, బిఆర్‌ఎస్ ఎస్ మాజీ ఎమ్మెల్సే జీవన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వరికి కనీస ధర రూ.1,702 రెండు సార్లు టెండర్లు వేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,220 యావరేజ్ ఎంఎస్‌పి ధరను చెల్లిస్తోందన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేయడానికి రవాణా వ్యవస్థను సిద్ధం చేశామన్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో రైతులకు కనీస మద్ధతు ధర కంటే రేటు వస్తోందన్నారు.

తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
ధాన్యం కొనుగోళ్ల కోసం అదనపు కేంద్రాలను తెరిచేందుకు అధికారులకు అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై బిజెపి, బిఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అర్థ రహతమని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో తాము పారదర్శకంగా వ్యవహారిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోళ్లు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తాము ధాన్యం కొనుగొలు చేసినంత నిజాయితీగా ఎవరూ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. గత ప్రభుత్వం వంద హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ప్రభుత్వం తమదే అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం లో సన్న బియ్యం, దొడ్డు బియ్యం అన్న తేడా లేకుండా వేలంలో అమ్మివేశారని మంత్రి ఆరోపించారు. ఈ సారి ధాన్యాన్ని వేలం వేయడం ద్వారా రూ.1110.05 కోట్లు ఎక్కువగా వచ్చాయని మంత్రి తెలిపారు. పౌర సరఫరాల శాఖను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడిపించిందని, ప్రతి జిల్లాలో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసే మాఫియా ఎక్కువగా తయారయ్యిందన్నారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది
ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి కి 272 స్థానాల కన్నా ఎక్కువ సీట్లను గెలుస్తుందని, జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ప్రతిపక్ష పార్టీలు బురద జల్లేలా పిచ్చి పిచ్చి మాటలు మట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గెలిచి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News