Thursday, November 21, 2024

కాళేశ్వరం గేట్లు మూసేస్తే పెను ప్రమాదం పొంచి ఉంది: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే ఎత్తిపోస్తాం
రెండు రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ ప్రారంభం
బ్యారేజీలలో నీరు నిల్వ చేయొద్దని ఎన్‌డిఎస్‌ఎ చెప్పింది
కాళేశ్వరం గేట్లు మూసేస్తే పెను ప్రమాదం పొంచి ఉంది
స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన ఘోర తప్పిదం కాళేశ్వరం నిర్మాణం
రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్‌డిఎస్‌ఎ సూచనల మేరకు మూడు బ్యారేజీల నుంచి నీళ్లను వదిలేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఆపరేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. బ్యారేజీలో నీళ్లు వదలాలని ఎన్‌డిఎస్‌ఎ చెప్పింది కాబట్టే గేట్లు ఎత్తిపెట్టామని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తామని, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ మొదలు పెట్టి మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జలసౌధలో శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మేడిగడ్డ వద్ద నీళ్లు నిల్వ చేస్తే పరివాహన ప్రాంతాలు మునుగుతాయని అన్నారు.

బ్యారేజీలలో నీరు నిల్వ చేయొద్దని ఎన్‌డిఎస్‌ఎ చెప్పిందని, కాళేశ్వరం గేట్లు మూసేస్తే పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి సామర్థ్యంతో పంపింగ్ చేయాలని బిఆర్‌ఎస్ చెబుతోందని, ఏదైనా ప్రమాదం జరిగితే మేడిగడ్డ సమీపంలోని 44 గ్రామాలు కొట్టుకుపోతాయని అన్నారు. భద్రాచలం కూడా పూర్తిగా కొట్టుకుపోతుందని చెప్పారు. మేడిగడ్డ పొంగినప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వమే నీళ్లను కిందకు వదిలిందని, ఇప్పుడేమో మేడిగడ్డ నుంచి నీళ్లు పంపింగ్ చేయాలని కోరుతోందని మండిపడ్డారు. నీళ్లు వదలాలని బిఆర్‌ఎస్ నేతలు తమకు ఇస్తున్న వార్నింగ్‌లను చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. కెటిఆర్ కంటే ఎన్‌డిఎస్‌ఎకు తెలివి ఎక్కువ ఉందని అనుకుంటున్నామని పేర్కొన్నారు. మీరే నాశనం చేసి, మీరే పంప్‌లను ఆన్ చేస్తా అనడం విడ్డూరమని బిఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కెసిఆర్, కెటిఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహట్టి దగ్గర వైఎస్‌ఆర్ కూడా శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దానికే ప్రాణహిత చేవెళ్ల అని పేరు పెట్టారని.. పనులు కూడా మొదలయ్యాయని తెలిపారు. ఎక్కువ ఖర్చు అయితే, ఎక్కువ కమీషన్లు వస్తాయని బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ పేరు మార్చి కాళేశ్వరం అని పెట్టారని వెల్లడించారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టాలని ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. అందులో భాగంగా వైఎస్‌ఆర్ తుమ్మిడిహట్టి దగ్గర శంకుస్థాపన చేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.80వేల కోట్లకు పెంచారని అన్నారు. కాగ్ లెక్కల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.1.47 లక్షల కోట్లు కావాలని, కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రాజెక్టులోని అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంటు బిల్లే రూ.10వేల కోట్లు అవుతుందని, ప్రాజెక్టు పూర్తయి అన్ని మోటార్లు రన్ చేస్తే ఈ వ్యయం ఇంకా పెరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో రుణాలు తీసుకున్నారని, ఏడాదికి కాళేశ్వరంపై రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని మండిపడ్డారు. దాదాపు రూ.94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద కేవలం 93 వేల ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని తెలిపారు. డిపిఆర్‌లోని అంశాలను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, సెంట్రల్ డిజైన్ సంస్థ ప్రకారం నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆలోచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, స్వతంత్ర భారత చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఎవరూ చేసి ఉండదని వ్యాఖ్యానించారు. ప్రజలకు కెసిఆర్, కెటిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో బిఆర్‌ఎస్ నేతలు విహార యాత్ర చేస్తున్నారని విమర్శించారు.

ఎన్‌డిఎస్‌ఎ నివేదికపైనా బిఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తోంది
మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర చేసిందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోందని, మేడిగడ్డ మొదలుపెట్టినప్పుడు, కూలినప్పుడు కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డలో పిల్లర్లు 6 అడుగులు లోపలికి కుంగాయని, నాసిరకంగా నిర్మించడం వల్లే బ్యారేజీ కుగిందని ఎన్‌డిఎస్‌ఎ స్పష్టం చేసిందని తెలిపారు. ఎన్‌డిఎస్‌ఎ నివేదికపైనా బిఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తోందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అక్టోబరు 21న బ్యారేజీ కుగిందని, డిసెంబర్‌లో తమ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. మేడిగడ్డ వద్ద ఎవరో బాంబులు పెట్టినట్లు ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేశారని, బ్యారేజీ కుంగినా కెసిఆర్ నోరు మెదపలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News