హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఇద్దరు ఎంపీలతో కలిసి ఐక్యరాజ్యసమితి క్లైమేట్ సమ్మిట్ (సిఓపి 27)లో దక్షిణాసియా పార్లమెంటరీ రౌండ్‌టేబుల్‌లో భారత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. పార్లమెంట్ మరియు యుఎస్ఎఐడి, షర్మ్-ఎల్-షేక్, ఈజిప్ట్‌లో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు నవంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరగనుంది. ఇంధన భద్రత, వాతావరణ మార్పుల పరిష్కారానికి ద్వైపాక్షిక ఒప్పందాలకు అతీతంగా దక్షిణాసియాలో ప్రాంతీయ ఇంధన సహకారాన్ని ఏవిధంగా పెంపొందించుకోవచ్చనే దానిపై సంయుక్తంగా చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశమని ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇది కొన్ని నెలల క్రితం ఆన్‌లైన్‌లో నిర్వహించిన మొదటి దక్షిణాసియా పార్లమెంటేరియన్ల సమావేశానికి కొనసాగింపుగా జరగనుందని వివరించారు.
ఈ సమావేశంలో పాల్గొనేవారు వచ్చే ఏడాది దక్షిణాసియా ఇంధన సహకారంపై ప్రాంతీయ పార్లమెంటరీ ఫోరమ్‌ను ప్రారంభించే సమావేశానికి ఇన్‌పుట్‌లు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నందున ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని ఒక ఉదాహరణను ఉటంకిస్తూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతు పవనాల పొడిగింపు మరియు అధిక వర్షపాతం భారీ వరదలకు దారి తీసిందని వివరించారు. అదే విధంగా వడగాలులు చలి తీవ్రత, వర్షపాతం లేదా కరువు వంటి కాలానుగుణ పరిస్థితుల తీవ్రత భారతదేశంలోని మానవ జీవితాలపై మాత్రమే కాకుండా, మొత్తం ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. అందువల్ల, వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు మొత్తం దక్షిణాసియా దేశాలు కలిసి పని చేయాలని ఆయన అన్నారు. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, శ్రీలంక దేశాల నుంచి కనీసం ఇద్దరు పార్లమెంటేరియన్లను ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న లేదా భవిష్యత్తులో సంభవించే సమస్యలకు పరిష్కారాలను అందించే సిఫార్సులు మరియు సూచనలతో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు ముందుకు వస్తుందని ఆయన వివరించారు.