ఘాజీపూర్(యూపీ): కుటుంబ సభ్యుల నిరసన తర్వాత ఘాజీపూర్ విద్యాధికారులు 1965 యుద్ధవీరుడు అబ్దుల్ హమీద్ పేరును తిరిగి యూపీ స్కూల్ ప్రవేశ ద్వారానికి పునరుద్ధరించారు. ఆ స్కూల్ జిల్లా ప్రధానకేంద్రంకు 35 కిమీ. దూరంలో జఖనియన్ తహసిల్‌లోని ధాముపూర్ గ్రామంలో ఉంది. పరంవీర్ చక్ర అవార్డీ అయిన అబ్దుల్ హమీద్ తన బాల్యంలో అదే స్కూల్‌లో చదువుకున్నాడు. ఐదు రోజుల ముందు స్కూల్‌కు రీపెయింట్ చేసి ‘పిఎం శ్రీ కాంపొజిట్ స్కూల్’ అని పేరుపెట్టారు. విద్యాధికారులు మొదట హమీద్ కుటుంబస్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ హమీద్ మనువడు జమీల్ అహ్మద్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
కాగా ‘నేడు, అంటే ఫిబ్రవరి 18న స్కూల్‌కు మళ్లీ షహీద్ వీర్ అబ్దుల్ హమీద్ పిఎం శ్రీ కాంపోజిట్ స్కూల్, ధాంపూర్, జఖనియన్, ఘాజీపూర్ జిల్లా అని పేరు పెట్టారు’ అని అహ్మద్ ధ్రువీకరించారు. పేరును తొలగించడానికి బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హేమంత్ రావు కారణమని హమీద్ కుటుంబ సభ్యులు నిందించారు. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడి పేరును తొలగించడం పెద్ద తప్పు’అని అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మాజీ యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ‘ఇక మిగిలింది ‘ఇండియా’ పేరును ‘బిజెపి’ అని మార్చడమే’ అని అఖిలేశ్ యాదవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర పోషించని వారికి అమరవీరుల ప్రాముఖ్యత ఎలా తెలుస్తుంది’ అని కూడా ఆయన పేర్కొన్నారు.