సిఎం ధామినా ఇతరులా తేలుతుంది
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు సోమవారం డెహ్రాడూన్‌లో సమావేశం అవుతారు. పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నిక ఈ సమావేశం దశలో జరుగుతుంది. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి ఎన్నికలలో బిజెపి అధికార స్థాపనకు తగు బలం సంతరించుకుంది. రాష్ట్రంలో తిరిగి రెండోసారి బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. ఈ దశలో ఆయన తిరిగి సిఎం అవుతారా? అనే అంశం చర్చకుదారితీసింది. అన్ని అంశాల పరిశీలనకు బిజెపి అధినాయకత్వం పిలుపు మేరకు ఆదివారం ఆపద్ధర్మ సిఎం ధామి, మాజీ సిఎంలు రమేష్ పోక్రియాల్ నిశాంక్, త్రివేంద్ర సింగ్ రావత్ ఢిల్లీకి వచ్చారు.
హోం మంత్రి అమిత్ షా నివాసంలో పార్టీ అధినాయకత్వంతో రాష్ట్రంలో తదుపరి సిఎం ఎవరనే అంశంపై చర్చించారని ఉత్తరాఖండ్ బిజెపి అధ్యక్షులు మదన్ కౌశిక్ విలేకరులకు తెలిపారు. కౌశిక్ కూడా పార్టీ నేతలతో భేటీలో పాల్గొన్నారు. అమిత్ షా, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా ఇతర నేతలతో ఉత్తరాఖండ్ నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే సోమవారం పార్టీ శాసనసభాపక్షం సమావేశం నిర్ణయం తీసుకున్నారని బిజెపి రాష్ట్ర స్థాయి నేత కౌశిక్ తెలిపారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు సంబంధిత బాధ్యతలను రక్షణ మంత్రి, సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ తీసుకున్నారు. సొంత నియోజకవర్గం ఖటామీలో తాను ఓడినా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన ధామి తిరిగి సిఎం అవుతారా? మాజీలలో ఎవరో ఒక్కరికి అవకాశం ఇస్తారా? అనేది నేడు (సోమవారం ) స్పష్టం అవుతుంది.