డెహ్రాడూన్: తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగలో మంగళవారం ఆకస్మికంగా కురిసిన కుంభవృష్టి వల్ల సంభవించిన నష్టాన్ని అంచనావేసేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ బుధవారం ఆ ప్రాంతాన్ని పర్యటించారు. తన మంత్రివర్గ సహచరులతో కలసి పర్యటించిన ఆయన బాధితులను కలుసుకుని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు సత్వరమే సహాయం అందచేయాలని ఆయన జిల్లా మెజిస్ట్రేట్ ఇవ శ్రీవాస్తవను ఆదేశించారు.
మంగళవారం హటాత్తుగా కురిసిన కుంభవృష్టకి రెండు మున్సిపల్ భవనాలు నేలమట్టం కాగా, అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి. పాదచారులు నడిచే వంతెనలు, మంచినీటి పైప్‌లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు కూడా వర్షం కారణంగా దెబ్బతిన్నాయి. శాంతి నది మీదుగా కురిసిన భారీవర్షంతో నదీ తీరంవెంబడి ఉన్న అనేక గ్రామాలు జలమయమయ్యాయి. దేవప్రయాగకు చెందిన దశరథ దండ పర్వత ప్రాంతంలో అనేక దుకాణాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు తెలియరాలేదు.