గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన ముఖ్యమంత్రి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతకు ముందు ఆయన ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసి రాజీనామాకు సంసిద్ధతను తెలియజేశారు. వాస్తవానికి ఆయన గత మూడు రోజులుగా ఢిల్లీలో బిజెపి పెద్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి బిజెపి ఎంఎల్‌ఎలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. కొత్త ముఖ్యమంత్రి పదవికి రెండు పేర్లు పార్టీ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వారిలో ఒకరు సత్పాల్ సింగ్ కాగా, మరొకరు ధన్‌సింగ్ రావత్. తీరథ్ సింగ్ గత మార్చి 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం పౌరీ గర్వాల్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన ఆరు నెలల్లోపల అంటే సెప్టెంబర్ 10లోగా ఎంఎల్‌ఎగా ఎన్నిక కావాలి. అయితే కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎ పదవీకాలం కనీసం ఏడాది ఉండాలి. కానీ ఉత్తరాఖండ్ శాసన సభ పదవీ కాలం తొమ్మిది నెలలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ఉప ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఎన్నికల సంఘానికి లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందువల్ల రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడం కోసం తీరథ్ సింగ్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.