రాష్ట్ర నేతలతో చర్చల అనంతరం అధిష్ఠానం నిర్ణయం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ నేతలతో నాలుగు గంటల చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నది. తాను ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాయని, తనకు అందరూ సహకరించాలని అధిష్ఠానంతో సమావేశం అనంతరం రావత్ అన్నారు. అయితే, పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటించలేదు. ఎన్నికల అనంతరం పార్టీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంటుందని రావత్ అన్నారు. కాంగ్రెస్ కోసం ముందుకు వెళ్లాలి, కాంగ్రెస్ కోసం పాడాలి అంటూ రావత్ వ్యాఖ్యానించారు.
బుధవారం కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్ చేసిన రావత్ ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. రావత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నిర్ణయించడానికి ముందు రాహుల్‌గాంధీ.. రావత్‌తోపాటు ఉత్తరాఖండ్ పిసిసి చీఫ్ గణేశ్‌గోదియాల్, సిఎల్‌పి నేత ప్రీతమ్‌సింగ్, మరికొందరు ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధ్యక్షతన ఉత్తరాఖండ్ నేతల సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోతున్న సంకేతాల మధ్య అధిష్ఠానం జోక్యం చేసుకొని సయోధ్య కుదిర్చడం తాత్కాలిక ఊరటగానే కొందరు విశ్లేషిస్తున్నారు.