Wednesday, January 29, 2025

ఉత్తరాఖండ్‌లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దాని లోని విధి విధానాలకు సంబంధించిన పోర్టల్‌ను ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఆవిష్కరించారు. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా పౌరులందరికీ, సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వెల్లడించారు. ఈరోజు ఉత్తరాఖండ్‌కే కాకుండా యావత్ దేశానికి చారిత్రాత్మకమైన రోజని, దేశంలో యాసీసీసి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుతో నిజమైన మహిళా సాధికారత కనిపిస్తుందని పేర్కొన్నారు.

వారి హక్కులను కాలరాసే బాల్యవివాహాలు , ట్రిపుల్ తలాక్ , విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి యాసీసీ తోడ్పడుతుందని ధామి తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి ఏ మతానికి వర్గానికి వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నట్టు వివరించారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్డ్ తెగలను దీని నుంచి దూరంగా ఉంచామని, తద్వారా ఆ తెగలు వారి హక్కులను పరిరక్షించుకోవచ్చని అన్నారు.

యుసిసి లోని కీలక అంశాలు
వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన, వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది.సహ జీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహజీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీసం వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News