Sunday, December 22, 2024

ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఉత్తరాఖండ్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని పుష్కర్‌సింగ్ దామీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి) అమలుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనాప్రకాశ్ దేశాయ్ నేతృత్వం లో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీ దీనికి సంబంధించిన నివేదికను త్వరలో సమర్పించే అవకాశం ఉంది. ఆపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ బిల్లుకు చట్ట రూపం తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. యాసీసీ (ఉమ్మడిపౌరస్మృతి) ని అమల్లోకి తీసుకొస్తే దేశం లోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో ఏకరూపత తీసుకురావడమే ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టం ఉద్దేశం.

తాము అధికారం లోకి వస్తే యూసీసీని తీసుకొస్తామని ఉత్తరాఖండ్ లోని బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే అధికారం లోకి వచ్చిన వెంటనే 2022 మే నెలలో నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక రాగానే యూసీసీని అమలు చేస్తామని సీఎం పుష్కర్ సింగ్ దామీ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కమిటీ రాబోయే మూడు నాలుగు రోజుల్లో తన నివేదికను సమర్పించనుందని తెలుస్తోంది. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో అన్ని మతాలకూ ఒకే విధానం ఉండాలని సూచించడంతో పాటు లింగ సమానత్వం, పూర్వీకుల ఆస్తుల్లో కుమార్తెలకూ సమానవాటా వంటి అంశాలపై నిపుణుల కమిటీ దృష్టి పెట్టనుంది.

వివాహానికి స్త్రీల కనీస వయసును 21 కు పెంచాలన్న డిమాండూ వచ్చినప్పటికీ … 18 కే కమిటీ పరిమితమైనట్టు తెలుస్తోంది. సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నట్టు సమాచారం. నివేదిక సమర్పించాక బిల్లులో ఇంకేం వివరాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలయ్యాక , 2024 ఎన్నికలకు ముందే గుజరాత్ లోనూ ఇదే చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇదే జరిగితే యూసీసీని అమలు చేసిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలవనుంది. అయితే స్వాతంత్య్రానికి ముందు నుంచే గోవాలో సివిల్ కోడ్ అమలవుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News