ఆప్ నేత కేజ్రీవాల్ హామీ
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారం లోకి వస్తే ఉపాధి కోసం వలసలు పోయే పరిస్థితిని నివారించడానికి భారీ చర్యలు తీసుకుంటామని, నిరుద్యోగులకు భృతి కల్పించడంతోపాటు స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆదివారం హామీ ఇచ్చారు. ఈమేరకు కేజ్రీవాల్ ఆరు హామీలు ఇచ్చారు. హల్‌ద్వానీ లో ఆదివారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాఖండ్ లోని ప్రతి యువకునికి ఉద్యోగం కల్పిస్తామని, ప్రతికుటుంబం లోని ఒక యువకునికి ఉద్యోగం వచ్చేవరకు నెలనెలా రూ.5000 భృతి కల్పిస్తామని, స్థానికులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో 80 శాతం తప్పనిసరిగా అందేలా చూస్తామని, అధికారం లోకి వచ్చిన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇవే కాక రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ తదితర ఇదివరకటి హామీలను కూడా నెరవేరుస్తామని ప్రకటించారు.