Sunday, September 8, 2024

మళ్లీ ఆగిన డ్రిల్లింగ్..

- Advertisement -
- Advertisement -

ఉత్తర కాశి: ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా టన్నెల్‌లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటికి తీసుకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కార్మికులు క్షేమంగా బైటికి వస్తారనే ఆశలు చిగురిస్తూ ఉంటే ఆ వెంటనే ఏదో ఒక అవాంతరం ఎదురు కావడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఎన్‌డిఆర్‌ఎఫ్ పథకం ప్రకారం గురువారం రాత్రే వీరిని బయటకు తీసుకు వచ్చే ప్రక్రియ పూర్తి కావలసి ఉంది. కానీ చివరి నిమిషంలో పనులకు ఆటంకం కలగడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. గురువారం రాత్రి ఎదురయిన ఇబ్బందులను పరిష్కరించాక శుక్రవారం మధ్యాహ్నం ప్రాంతంలో తిరిగి పనులు మొదలవుతాయని చెప్పినా సాయంత్రం వరకు కూడా మొదలు కాలేదు. ఆ తర్వాత కొద్ది గంటలకే డ్రిల్లింగ్ యంత్రంలో సాంకేతిక సమస్య కారణంగా పనులను ఆపి వేశారు.

డ్రిల్లింగ్ జరుపుతున్న అమెరికన్ ఆగర్ మిషిన్‌లో ఏదో వస్తువు చిక్కుకున్నదని, అందుకే దాన్ని సరిచేయడానికి తమను పిలిపించారని జిపిఆర్ సర్వే టీమ్ జియోఫిజిస్టు బి చెందూర్ చెప్పారు. ఈ లోపాన్ని సరి చేసిన ర్వాత అంటే శనివారం మాత్రమే రెస్కూ పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇంకో 12 మీటర్లు మాత్రమే డ్రిల్లింగ్ చేస్తే కూలీలు ఉన్న ప్రాంతానికి రెస్కూ బృందాలు చేరుకునే అవకాశం ఉండేది. కూలీలను క్షేమంగా బయటకు తీసుకు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు శుక్రవారం సిద్ధం చేసుకున్నాయి. కూలీలను టన్నెల్ లోపలినుంచి బయటకు ఎలా తీసుకు రావాలనే దానిపై వారు ట్రయల్స్ కూడా నిర్వహించారు. రెండు రోజులగా అవసరమైన అంబులెన్స్‌లు, డాక్టర్లను, తాత్కాలిక ఆస్పత్రిని కూడా ఘటనా స్థలంలో సిద్ధం చేసి ఉంచారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారంనుంచి సంఘటనా స్థలంలోనే ఉండి రెస్కూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఇక్కడినుంచే విధులను కొనసాగించడానికి వీలుగా తాత్కాలిక క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి వికె సింగ్ కూడా ఉత్తరకాశిలోనే ఉంటూ రెస్కూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. టన్నుల్‌లోపల చిక్కుపడిన కూలీలతో ఎప్పటికప్పుడు అధికారులు మాట్లాడుతూ వారిలో నైతిక ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. కూలీల కుటుంబ సభ్యులు కూడా వారితో మాట్లాడుతున్నారు. కాగా 13 రోజులగా టన్నెల్‌లోపలే ఉండిపోయిన కూలీలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి అధికారులు అనేక చర్యలు తీసుకొంటున్నారు. పైపుల ద్వారా వారికి డ్రైఫ్రూట్స్, ఆహారాన్ని చేరవేస్తున్నారు.

మరో వైపు వారు ఉల్లాసంగా ఉండడం కోసం లూడో, చెస్ వంటి బోర్డు గేమ్స్‌ను కూడా అందజేయనున్నట్లు సహాయక బృందంలోని మానసిక వైద్యుడు డాక్టర్ రోహిత్ గోండ్వాల్ చెప్పారు. టన్నెల్‌లో కార్మికులు చిక్కుకపోయి ఇప్పటికి13 రోజులయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News