దళిత సాహిత్యాన్ని ప్రధానంగా నాలుగు దశలుగా చూడవచ్చు. మొదటి దశ- మానవవాద దశ. ఈ దశలో కథ, నవల, నాటకం ఎక్కువగా రాలేదు. కానీ కవిత్వమొచ్చింది. ఆ కవిత్వం అస్పృశ్యతను, కులాన్ని వ్యతిరేకించింది. వాటికి ఆధారమైన మతపరమైన, సంస్కృతి పరమైన శాంక్షన్‌ను మాత్రం పెద్దగా ప్రశ్నించలేదు. రెండవ దశ- స్వాతంత్య్రోద్యమ దశ. ఈ దశలో దళిత సాహిత్యం గాంధేయవాదం, హరిజనోద్యమ ప్రభావంతో వచ్చింది. ఈ దశలో దళితేతరులు దళితుల కోసం కవిత్వం, కథలు రాసారు. మూడవ దశ- మొదటి తరం విద్యావంతులైన దళితుల రచనాదశ. ఇందులో భాగంగా వచ్చిన రచనలు ప్రధానంగా అగ్రకుల ఇన్‌ఫ్లుయెన్స్‌తో వచ్చాయి.
నాలుగవదశ- దళిత సాహిత్యానికి సంబంధించినంత వరకు ప్రధానమైన దశ. ఈ దశలో రెండవ, మూడవ తరానికి చెందిన విద్యావంతులైన దళితులు అస్తిత్వ ఉద్యమాల ప్రభావంతో, సానుభూతితో కాకుండా ధిక్కార స్వరంతో రాశారు. మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్బాబు, కలెకూరి ప్రసాదు, తాళ్లూరి లాభన్ బాబు, ఎర్ర ఉపాలి, ఎండ్లూరి సుధాకర్ మొదలగువారు సుప్రసిద్ధులు. వీరేగాక త్రిపురనేని శ్రీనివాస్, గుంటూరు లక్ష్మీనరసయ్య, ఖాజా, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అంబటి సురేంద్రరాజు లాంటి దళితేతరులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో పలువురు మహిళలు కూడా దళిత సాహిత్యవేత్తలుగా ఎదిగారు. రాజ్యాంగం పట్ల, అది రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల, కొత్త చైతన్యం వెల్లివిరియడంతో వీరందరిపై అంబేద్కర్‌వాద ప్రభావం పడింది.
అయితే ఈ దశలను గమనించినట్లయితే అప్పుడు జరుగుతున్న సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాల ప్రభావం సాహిత్యంలో పడుతూ వచ్చినట్లు తెలుస్తోంది. కారంచేడు, చుండూరు సంఘటనలు తర్వాత దళిత అస్తిత్వ ఉద్యమాలు తెలుగు ప్రాంతాన ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అగ్రకుల మనువాద సంస్కృతిపై ధిక్కారం, రాజ్యాధికార కాంక్ష మొదలగునవి సాహిత్యంలో వస్తువులుగా వచ్చాయి. ఈ సాహితీవేత్తలు మనువాద ఆధిపత్య కులాలను ధిక్కరించడమే కాకుండా, వామపక్ష ఉద్యమంలో అంతర్లీనంగా ఉన్న కులాన్ని కూడా ప్రశ్నించారు. అదే విధంగా దళితుల కులం గోడల్ని బద్దలు కొట్టడానికి విద్య ఎంత అవసరమో నొక్కిచెబుతూ వచ్చిన రచనలు కూడా ఉన్నాయి. అయితే వీటితో పాటు భూమి, ఇతర సహజ వనరులపై హక్కు, ప్రైవేటు రంగంలో, సంపద సృష్టిలో వాటా వంటి వస్తువులపై ఇంకా ఎక్కువ సాహిత్యం రావాల్సి ఉంది.
తెలుగు ప్రాంతమంతటా ఈ దళిత సాహిత్య ఉద్యమ దశలు ఇంచుమించుగా ఒకేలా ఉంటే, ఉత్తరాంధ్రలో మాత్రం స్తబ్దుగా సాగింది. ఈ స్థితికి కారణం ఉత్తరాంధ్ర వెనుకబాటే. ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ నేపథ్య సాహిత్యం విరివిగా వచ్చింది. అది కూడా శ్రీకాకుళం గిరిజనోద్యమంలో మిళితమై ఉంది. అంటే ఇక్కడి కవులు, రచయితలు వామపక్ష విప్లవ దృక్కోణంలోనే ప్రయాణించారన్నమాట. ఒకప్పుడు కళింగాంధ్రలోని అంతర్భాగమైన ప్రస్తుత ఆరు జిల్లాల ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర అని పిలవడం కద్దు. బ్రిటిష్ వలస పాలన కాలంలో కళింగాంధ్ర కొన్ని జమీందారీ సంస్థానాల పాలనలో ఉండేది. భూమి అంతా జమీందారుల చేతుల్లోనే ఉండేది. వారి అదుపాజ్ఞలలో ఇక్కడి ప్రజలు జీవనముండేది. కాలక్రమేణా గ్రామాల్లో అక్కడక్కడ అథమ స్థాయిలో జమీల ద్వారా సంక్రమించిన వందల ఎకరాలు గల భూస్వాములు కనపడేవారు.
తొంభై శాతానికి పైగా మిగతా ప్రజలంతా సన్నకారు రైతులు, కూలీలుగా జీవనం సాగించేవారు. ఈ ప్రాంతంలో ఉండే మూడు మెజారిటీ ఎగువ వెనుకబడిన వర్గాలు ఎక్కువగా సన్నకారు రైతులుగా, కూలీలుగా ఉంటే, మిగతా బహుజన వర్గాలు కులవృత్తులు, కూలీలుగానే జీవనోపాధి వెతుక్కునేవారు. అందువల్ల ఇక్కడ వెనుకబడిన, దళిత వర్గాల ఆర్థిక స్థాయిలు ఇంచుమించుగా ఒకేలా ఉండేవి. వీరంతా ఒకేచోట కలసిమెలసి పని చేసుకునేవారు. ఇదే వీరి మధ్య కులాతీత సోదర భావనకు కొంత కారణం కావొచ్చు. ఎక్కడా కులాల మధ్య కుమ్ములాటలు పెద్దగా కనబడేవి కావు. అందువల్ల ఇక్కడ దళిత ఉద్యమం, దళిత సాహిత్య ఉద్యమాలు పెద్దగా పరిఢవిల్లలేదు.
తర్వాత తర్వాత ఈ ప్రాంతంలో రాజకీయ కక్షలు పెరిగాక కులవివక్ష సమస్య తలెత్తింది. ప్రభుత్వ మిగుల భూములపై తమ వాటా కోసం ఇరువర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఎగువ వెనుకబడిన వర్గాలు, దళితుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. ఇదే తదనంతరం దళితులపై కొన్ని ఊచకోతలు జరగడానికి ప్రధాన కారణమైంది. లక్ష్మింపేట లాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ఇక్కడ దళితుల్లో చైతన్యం రాలేదు. ఇతర ప్రాంతాల దళితులు, కొన్ని దళిత సంఘాలు సమస్యను దేశవ్యాప్తం చేయడం ద్వారా కొంత చలనమొచ్చింది. ఈ ప్రాంతంలో దళిత సాహిత్యవేత్తలు అతి తక్కువమందే ఉన్నారు. గతంలో ఇక్కడ సాహిత్యాన్ని అగ్రకులాల వారే నడిపారు. నేడు నాన్ దళిత బహుజన వర్గాల వారే హెచ్చుస్థాయిలో రాస్తున్నారు. వీరు అడపాదడపా దళిత వస్తువుని తీసుకుంటున్నారే తప్ప, ప్రత్యేకించి దళిత సాహిత్య ఉద్యమానికి చేసిన కృషి లేదు.
వందేళ్ళకు పైబడిన ఉత్తరాంధ్ర ఆధునిక సాహిత్యాన్ని విహంగ వీక్షణం చేస్తే అతి తక్కువ స్థాయిలో దళిత సాహిత్య సృజన జరిగినట్లు తెలుస్తోంది.
అది కూడా కథా ప్రక్రియలోనే ఎక్కువగా చూడొచ్చు. కవిత్వంలో మాత్రం హీనస్థాయే. ఇలాంటి స్థితిలో కూడా కవితా మెరుపులు మెరిపించిన వారు లేకపోలేదు. అలాంటి ఉత్తరాంధ్ర దళిత కవిత్వ తీరుతెన్నులను పరామర్శించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. మహాకవి ‘గురజాడ అప్పారావు’ కథ, గేయం ద్వారా పలు సామాజిక సంస్కరణలకు పూనుకున్న వ్యక్తి. రాజుల కాలం నాటి ఎగుడుదిగుడుల కుల వ్యవస్థ నిజ స్వరూపాన్ని తన గేయాల్లో బట్టబయలు చేసారు. లవణ రాజు కలలో ‘మాలలు’ అనే గేయంలో మలిన దేహుల మాలలనుచును/మలిన చిత్తుల కధిక కులముల/నెల వొసంగిన వర్ణధర్మమ/ధర్మ ధర్మంబే అని చాతుర్వర్ణ వ్యవస్థను ఎండగడతారు. మంచి చెడ్డలు మనుజులందున/యెంచి చూడగ రెండె కులములు/మంచియన్నది మాలయైతే/మాలనే అగుదున్ ఇలలో గుణానికేగానీ, కులానికి ప్రాధాన్యత ఉండకూడదంటారు గురజాడ. గాంధేయవాద ప్రభావంతో స్వాతంత్య్ర ఉద్యమంలో చేరిన ‘గరిమెళ్ళ సత్యనారాయణ’ హరిజనోద్ధరణకు పాటుపడేలా గీతాలు రాశారు. అన్నలారా వినుడి మన-యఘ మొక్కటి గనుగొనుడి మన/ చిన్ని తమ్ములను జేరదీసి దయ-చేసి మహాదర మిడుడి/ అంటరాదనుచు నాడరాదనుచు-నతి దూరమునకు ద్రోసి/ స్నానము సేస్తిమి దూరము బొమ్మని-చావ వారలనుగొట్టి/ ఆ దీనులు తెచ్చిన వస్తువులెల్లను-దిని వారల బడదిట్టి అని అంటారు.
‘హరిజనులము, జ్ఞానోదయము, నూతన తేజము, హిందూ సంఘీయులము, అస్పృశ్యతా సిద్ధాంత నిరసనము, ఎటువంటి మాలలము’ లాంటి గీతాలు రాసి ఆనాడు దళిత చైతన్యానికి కృషి చేసారు. పురిపండ అప్పలస్వామి ‘గుడిలోని దైవమా’ అనే గీతంలో మాల పెట్టిన నేల-మాలముట్టిన నీరు/మాల పాడిన పాట-మాలలాడిన మాట/ మైలవడినంటారు -పనికిరాదంటారు/ గుడిలోని దైవమా ఆలింపవోయి-గుడిలోని దయ్యమా పైకి రావోయి అంటూ అడుగడుగునా దళితులపై జరిగిన వివక్షను ఎత్తిచూపారు. వంగపండు ప్రసాదరావు దళిత వస్తువును తీసుకొని పలు పాటలు రాసారు. ప్రతీ ఊరు చివరన ఛిద్రమైన స్థితిలో ఉన్న మాలపేట భౌతిక స్వరూపాన్ని హృద్యంగా తడుముతాడు. ఉందర్రా మాలపేట ఆ ఊరు సివర/ కష్టాలు వున్నసోటా ఆ ఊరు సివర/ కాస్టాలు వున్నసోటా ఇంకా చుండూరు సంఘటన నేపథ్యంలో రాసిన పాటలో గండర గండర గండ/ దళిత బిడ్డ లేవరో/ కత్తులు గొడ్డలి బట్టి/కక్ష తీర్చుకోవరో/ సుండూరు హత్యలూ మరణించే గుండెలో/ నరికినోన్ని పట్టుకొని నరుకుదాము రండిరో ఇలా విప్లవ శంఖం పూరిస్తాడు. ఇంకా ఇతని ఐదారు పాటలు దళితోద్యమంలో ఒక ఊపును ఊపాయి. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఓ డజను మంది దాకా కవులు మంచి కవిత్వాన్ని రాస్తున్నారు. వీరు అప్పుడప్పుడు మాత్రమే తమ సృజనలో దళిత వస్తువును నింపుతున్నారు.
రెడ్డి రామకృష్ణ ‘గొడిముక్క’ దీర్ఘ కవితలో ఉత్తరాంధ్ర అంతటా విస్తరించియున్న దళిత సమాజపు వెతలను సానుభూతితో విశదీకరించాడు. చింత అప్పలనాయుడు కళింగాంధ్ర మాండలికాన్ని కవిత్వీకరణ చేయడంలో దిట్ట. ఇతను రాసిన ‘మా ఊరి మాలపిల్ల, ఒక మాలపేట కొన్ని దృశ్యాలు’ కవితల్లో కళింగాంధ్ర దళిత జీవన స్థితిగతులను ఏకరువుపెడతాడు. మరోకవి సిరికి స్వామి నాయుడు రాసిన ‘కాకెంగిలి ప్రేమ’ కవితలో కుల వైరుధ్యాలు గల ఇద్దరి మిత్రుల అంతర్మథనాన్ని ఆర్ద్రంగా వెలిబుచ్చాడు. ఇతను రాసిన ‘శ్మశానం కోసమే’ అనే మరో కవిత దళిత అస్తిత్వ చైతన్యపు బావుటాను ఎగురవేస్తుంది. యువకవి పాయల మురళీకృష్ణ ‘కరవాలం చెప్పిన రహస్యం’ కవితలో… సాధారణంగా ఆసుపత్రుల్లో పోస్టుమార్టం చేసేవారంతా దళితులే. అలాంటి వ్యక్తుల జీవన సమరంలో గల మానసిక స్థితిని దైన్యంగా వివరిస్తాడు. గవిడి శ్రీనివాస్ రాసిన ‘దళిత స్వరం’ కైతలో దేశంలో అనునిత్యమూ దళితులపై జరుగుతున్న అమానుష సంఘటనలను నిరసిస్తాడు.
మరో వర్ధమాన కవి కంచరాన భుజంగరావు వ్రాసిన ‘ప్రాణమున్న కట్టెలు గురించి’ అనే కవితలో… ఇంకా దళిత జీవితాల్లో వెలుగులు రాకపోవడాన్ని ఆక్షేపిస్తాడు. లండ సాంబమూర్తి ‘నా గాయాలు నావి’ అనే కవితలో దళిత అస్తిత్వ వేదనలను హృద్యంగా ఎరుక చేస్తాడు. కెక్యూబ్ వర్మ రాసిన ‘భూమి రంగు మనుషులు’ కవితలో మట్టితో సహవాసం చేసే మూలవాసులకు ఈ మట్టిపై హక్కు లేకపోవడాన్ని తీవ్రంగా గర్హిస్తాడు. మరో ప్రముఖ కవి బాల సుధాకర మౌళి ‘చెన్న, జీవన్ నీ పాటలో, ఘర్ వాపస్ నహీ ఆతే, వ్రేళ్ళు గురించి, నలుపు రంగు, a way to hcu, దేహమే గాయమైన దేహమ్మీద, జ్వాల’ లాంటి కవితలకు దళిత వస్తువును అద్దారు. సీనియర్ కవి గంటేడ గౌరునాయుడు ‘ఓ గాయకుడా, గాయం’ అనే కవితల్లో దళిత చైతన్య దీప్తిని వెలిగించాడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుట్టి, నివసిస్తున్న నేటితరం కవుల్లో ‘కలమట దాసుబాబు’ ఒక్కరే దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఇతను ‘ప్రవహిస్తున్న పాట, భద్రత లేని బతుకులు, నాయన, మా ఆకలి నిషిద్ధమే, నెత్తుటి దమట, విముక్తి గీతం’ లాంటి కవితలు రాసారు. వీటిలో దళితుల ఆవేదనలు, ఆక్రందనలను ఎంతో ఆర్తితో చెప్పుకొచ్చాడు.
వీరేగాక మరి కొంతమంది అజ్ఞాతంగా ఉండొచ్చు. వారి సృజనను కూడా వెలికితీయాల్సిన ఆవశ్యకత ఉంది. సాహితీ పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేసి ఈ ప్రాంత దళిత కవిత్వాన్ని రికార్డు చేయాలి. ఇంకా ఇక్కడ పుట్టిన సీనియర్ సాహితీవేత్తలు దళిత కవులను, దళిత సాహిత్వాన్ని విధిగా ప్రోత్సహించాలి.
పిల్లా తిరుపతిరావు