డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో సొరంగం నుంచి విముక్తి పొందిన 41 మంది కూలీలను రిషికేష్‌లోని ఆలిండియా ఇనిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు (ఎయిమ్స్) తరలించారు. 17 రోజులుగా ఈ కూలీలు టన్నెల్‌లోపల చిక్కుపడ్డారు. వీరిని వెలికితీసేందుకు జాతీయ స్థాయి సహాయక బృందాలు పలు విధాలుగా యత్నించాయి. ఇది చిట్టచివరికి మంగళవారం విజయవంతం అయింది. ఇప్పుడు వీరిని చినూక్ హెలికాప్టర్‌లో తీసుకువచ్చారు. 17 రోజుల జీవన్మరణ బందీ సంక్లిష్టత మధ్య కూలీలను హెలికాప్టర్ల లో తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సిల్క్‌యారా దిండల్‌గాన్ టన్నుల్‌లో కూలీలు ఈ నెల 12 నుంచి చిక్కుపడ్డారు.
ఘటనాస్థలి నుంచి తొలుత కూలీలను సమీపంలోని చిన్యాలిసౌర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రికి తరలించారు. ముందుగా వీరికి తగు చికిత్సలు నిర్వహించారు. సమీపంలో ఉన్న హెలిడ్రోమ్‌లో చిన్నూక్ హెలికాప్టర్‌ను సిద్ధం చేసి ఉంచారు. విముక్తి పొందిన కూలీలతో పాటు కొందరు వైద్య సిబ్బంది కూడా రిషికేష్‌కు తరలివెళ్లింది. భారతీయ సైనిక వాయుదళానికి చెందిన హెలికాప్టరు ద్వారా వీరిని వైద్య సంస్థకు తీసుకువెళ్లారు. సాధ్యమైనంత త్వరగా వీరికి తగు చికిత్స కల్పించడం కీలక అంశం అయినందున అధికారులు వీరిని హుటాహుటిన తరలించడం జరిగింది. ఇప్పుడు కూలీల ఆప్తులు, బంధువులు రిషికేష్‌కు వచ్చి వారిని పరామర్శించేందుకు సౌలభ్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు.