హైదరాబాద్: ఎపి గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా టవర్‌ను కూల్చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ విహెచ్ స్పందించారు. ప్రజల దృష్టి మార్చడానికే బిజెపి నేతలుఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జిన్నా పేరు ఎందుకు గుర్తు వచ్చిందనీ, కావాలనే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇక రేపు తాజ్‌మహల్ తీసివేయమంటారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చార్మినార్ ఉంది.. దానిని ముస్లింలు కట్టించారు దానిని కూడా తీసేయమంటారా? అని ప్రశ్నించారు. పేరు మార్చడం కాదు, ప్రజల మన్ననలను పొందండి, వారి గుండెల్లో నిలిచిపోండి అని బిజెపికి చురకలు అంటించారు. గుంటూరులో పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా టవర్‌ను కూల్చేయాలని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారతదేశాన్ని విడదీసిన జిల్లా పేరుతో ఉన్న జిన్నా టవర్‌ను కూల్చేయాలన్నారు. అలీ జిన్నా భారతదేశానికి చాలా ద్రోహం చేశారని.. అటువంటి దేశద్రోహి అలీజిన్నా పేరు టవర్‌కు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. లేదంటే బిజెపి కార్యకర్తలే టవర్‌ను కూల్చేస్తారని రాజాసింగ్ వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలిలో పాకిస్థాన్ జాతిపిత పేరుతో జిన్నా టవర్ నిర్మించారు. ఏడు దశాబ్దాలు క్రితం నిర్మించిన జిన్నా టవర్ సెంటర్ గుంటూరులో మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. భారత స్వాతంత్య్రానికి పూర్వం భారత పాకిస్థాన్‌లు కలిసే ఉండవన్న సంగతి విదితమే. స్వాతంత్య్రానికి పూర్వం ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండేవి. దేశ స్వాతంత్య్ర కోసం అనేకమంది నేతలు పోరాడుతున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహహ్మద్ అలీ జిన్నా కూడా పాల్గొన్నారు. గుంటూరులో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగింది.
1942లో గుంటూరు ప్రాంతానికి చెందిన లాల్‌జాన్ భాషా.. మొహమ్మద్ అలీ జిన్నాతో గుంటూరులో భారీ సభ నిర్వహించాలని తలపించారు. బొంబాయి వెళ్లి జిన్నాను కూడా ఆహ్వానించారు. సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేయగా, చివరి నిముషంలో జిన్నా సభకు హాజరు కాలేదు. కానీ ఆయన స్థానంలో జిన్నా స్నేహితుడు జుదా లియాఖత్ అలీఖాన్ ఈ సభకు హాజరయ్యారు. అయితే సభకు జిన్నా వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా స్మారక స్తూపాన్ని ఆవిష్కరించాలని లాల్ జాన్ భాషా ఆకాంక్షించారు. జిన్నా రాకపోవడంతో సభకు వచ్చిన అప్పటి స్వాతంత్య్ర సమరయోధులు ఈ స్తూపాన్ని ఆవిష్కరించి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి గుంటూరు నగరంలో ఈ టవర్ ఒక ల్యాండ్‌మార్క్‌గా ఉండిపోయింది.