మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఆలోచన దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు(విహెచ్) ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి నేతలు రోజుకొక కామెంట్స్‌తో వివాదం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను తవ్వాలంటారు, కర్ణాటకలో ఈశ్వరప్ప జాతీయ జెండాను మారుస్తామంటారు, వీళ్ల జాగీరా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల వారిని కించపరచడమేనా బిజెపి ఎజెండా అంటూ ఆయన ధ్వజమెత్తారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటని ఆయన మండిపడ్డారు. గల్ఫ్ నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. ఇవ్వం అంటే ఏంటి పరిస్థితి అని ఆయన ప్రశ్నించారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన వారిని జైల్లో పెట్టాలని, హిందూముస్లిం మధ్య చిచ్చు పెట్టి ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తున్నారన్నారు. బిజెపికి మూడోసారి అవకాశం ఇస్తే దేశం ముక్కలు అవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ జోడో భారత్ యాత్ర చేపడుతందని ఆయన వెల్లడించారు. రేప్ చేసే వారికి మరణశిక్ష విధిస్తే.. ఇలాంటి కేసులు తగ్గిపోతాయని విహెచ్ అన్నారు. న్యాయస్థానం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే నేరాలు తగ్గుతాయన్నారు.
V Hanumantha Rao fires on BJP Party