కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెనక్కి వచ్చేలా కనిపించడం లేదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అన్ని చోట్ల అన్యాయం జరుగుతోందని.. తనకు అన్యాయం జరిగినా నిలబడి కొట్లాడానని విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిలోకి పోవాలని రాజగోపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారని లాభం వున్న దగ్గరికి పోతే పోయారని, కాంగ్రెస్‌ను తిట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పిసిసి ఇప్పటి నుంచైనా సీనియర్లను కలుపుకుని పోవాలని హితవు పలికారు. ఒరిజినల్ కాబట్టే ఇక్కడే నిలబడి కొట్లాడానని ఆయన అన్నారు. కాంగ్రెస్ చచ్చిపోయిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మార్చుకునేలా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఎన్నికలు ఎదుర్కొంటారా లేదా అనేది ఆ జిల్లా నాయకులే చెబుతారని విహెచ్ తెలిపారు.
గతంలో బిజెపి గెలిచిన సీట్లలో తమ తప్పిదం వుందన్నారు. అటు కోమటిరెడ్డి వ్యవహారంపై ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ని బలహీనపరచాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్టీ మారాలని రాజగోపాల్ రెడ్డి ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. పార్టీలో అవమానం జరిగినట్లు రాజగోపాల్ రెడ్డి భావిస్తే.. అధిష్టానం మాట్లాడుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్తే నష్టమేనని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వెళ్లిందని ఆయన చెప్పారు. ఆయనతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్నారని.. మంచి నాయకుడిని పోగొట్టుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా వుందని సర్వేలు చూసి బిజెపి బలంగా వుందని రాజగోపాల్ రెడ్డి నమ్ముతున్నట్లుగా వున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
V Hanumantha Rao Sensational Comments Rajagopal Reddy