హైదరాబాద్: అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విహెచ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోరుకున్నారు. విహెచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన వీలైనంత వేగంగా మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షింస్తూ ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో, ప్రజావాణిని బలంగా వినిపించడంలోనూ విహెచ్ శైలి ప్రత్యేకమన్నారు. దీని వలనే ఆయనకు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఉన్నతస్థానం దక్కిందని పవన్ అన్నారు.
సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ విహెచ్ పోరాడతారని పవన్ గుర్తుచేశారు. ఆయన నేటి తరం నాయకులకు స్ఫూర్తిదాయమన్నారు. విహెచ్ అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు విహెచ్ ఆరోగ్యపరిస్థితి గురించి అపోలో వర్గాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నానని పవన్ పేర్కొన్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేకపోయానన్నారు. విహెచ్ సంపూర్ణ ఆయూరారోగ్యాలతో మళ్లీ ప్రజల్లోకి రావాలని జనసేన పార్టీ తరపున ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని పవన్ చెప్పారు.
అంబర్‌పేట్‌లో చండీయాగం..
విహెచ్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడాలని అంబర్‌పేట్ నియోజకవర్గం ప్రజలు మహంకాళి ఆలయంలో మూడు రోజుల వరకు చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొంటున్నారని ఆ పార్టీ పేర్కొంది.