తిరువనంతపురం : ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ శుక్రవారం 100వ సంవత్సరంలోకి ప్రవేశించారు. కామ్రేడ్ విఎస్‌గా పేరొందిన ఈ జనబాహుళ్య నేత పూర్తి పేరు వెలిక్కకథు శంకరన్ అచ్యుతానందన్. ఆయన వందవ జన్మదినం సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెలువడ్డాయి. 1964లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయి ఏర్పాటు అయిన సిపిఐ(ఎం) పార్టీకి ఆయన వ్యవస్థాపక నేతగా ఉన్నారు. వయోవృద్ధ సమస్యలతో గత కొద్దికాలంగా ఆయన ఎక్కువగా సభలకు సమావేశాలకు రావడం లేదు.
మీడియాకూ కూడా దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీకి ఆయన ఆలోచనలు, కార్యాచరణ దిశానిర్ధేశనం చేస్తోంది. తిరువనంతపురంలోని ఆయన కుమారుడు అరుణ్‌కుమార్ నివాసంలో విఎస్ కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపధ్యంలో ఆయనను నేరుగా కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి ఎవరూ రావద్దని పార్టీ వర్గాలు కోరాయి. విఎస్ శత జన్మదినం నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మెహమ్మద్ ఖాన్ ఫోన్‌ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కేరళ ఆధునిక ప్రస్థానంలో తానూ ఓ భాగమై విఎస్ సాగారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. పలువురు సిపిఎం నేతలు విఎస్‌కు జన్మదిన శుభాకాంక్షలు పంపించారు.
\