మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రముఖ లాజిస్టిక్స్ సరఫరా సంస్థ వి-ట్రాన్స్ ఇండియా రాబోయే మూడు సంవత్సరాలలో రూ.3,000 కోట్ల టర్నోవర్ చేరుకోవాలని లక్షంగా చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణ భారత్‌లో తన ఉనికిని విస్తరించడంపై సంస్థ దృష్టి పెట్టింది. దీని ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 600 వరకు ఉద్యోగావకాశాల సృష్టి జరుగుతుందని వి-ట్రాన్స్ చైర్మన్, గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర షా తెలిపారు. బుధవారం కంపెనీ భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. దక్షిణ భారత్‌లో కొత్త శాఖల ప్రణాళికలో హైదరాబాదు, బెంగళూరు, కోయంబత్తూరు వంటి నగరాలు ప్రధానంగా ఉన్నాయి. వి-ట్రాన్స్ ఈ ప్రాంతంలో లాజిస్టిక్స్, రవాణా సేవల కొరకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం, మెరుగైన కనెక్టివిటిని అందిచడాన్ని లక్ష్యంగా చేసుకుంది.
సంస్థకు 1000 పైగా శాఖలు, 50కి పైగా ట్రాన్స్‌షిప్మెంట్స్ కేంద్రాలు, లొకేషన్ ట్రాకింగ్ సదుపాయం ఉన్న 2500 ఆధునిక ట్రక్కుల దళంతో కంపెనీ దేశవ్యాప్తంగా ఉనికి కలిగి ఉందని మహేంద్ర షా వివరించారు. సంస్థ ఈ రంగంలో రాబోయే 1-2 ఏళ్లలో భారీగా ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. కంపెనీ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ షా మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో సంస్థ నెట్‌వర్క్ బలోపేతంతో కంపెనీ లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.