Monday, November 18, 2024

రైల్వే లైన్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో రూ. 8 కోట్లు మంజూరు చేస్తాం
హల్దీ వాగు ప్రాజెక్ట్ పనులు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు
అధికారుల సమీక్షలో మంత్రి హరీష్‌రావు

Vaccination center start in siddipet

మనతెలంగాణ/హైదరాబాద్: అక్కన్నపేట్ నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు రైల్వే అధికారులకు సూచించారు. ఆదివారం మెదక్ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, కోటి 35 లక్షలతో జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్ ను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం రైల్వే, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో మెదక్ రైల్వే లైన్, సాగునీటి ప్రాజెక్ట్ ల పురోగతిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రైల్వే లైన్ పనులను నాలుగైదు నెలల్లో పూర్తి చేసి రైలు కూత పెట్టేలా చూడాలని రైల్వే అధికారులకు మంత్రి హరీష్ రావు సూచించారు. రైల్వే లైన్ పనులు చివరి దశలో ఉన్నాయని, ఇంకా ఐదు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీనికి రూ. 25 కోట్లు అవసరమని రైల్వే డివిజనల్ ఇంజనీర్ సధర్మ పేర్కొనగా, వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని మంత్రి హామినిచ్చారు.

మరో రూ.25 కోట్లను వెంటనే మంజూరు చేస్తాం

రైల్వే లైన్ నిర్మాణానికి గత మార్చిలో రూ.40 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వే శాఖకు ఇచ్చిందని, మరో రూ.25 కోట్లను వెంటనే మంజూరు చేస్తామని, పనులను త్వరితగతిన చేపట్టి వేగవంతం చేసి దసరా నాటికి రైల్వేస్టేషన్ ప్రారంభించేలా చూడాలని రైల్వే అధికారులను మంత్రి కోరారు. అనంతరం ఘణపురం ఆనకట్ట, హల్దీ వాగు ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తూ ఘణపురం ఆనకట్ట ప్రాజెక్టు 1.725 మీటర్ల ఎత్తు పెంచడంలో భాగంగా భూ సేకరణకు గతంలో రూ.5 కోట్లు మంజూరు చేశామని, భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో 8 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నామని మంత్రి తెలిపారు. తద్వారా నీటి నిలువ సామ ర్థ్యాన్ని పెంచుకొని మరికొన్ని వేల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చన్నారు. కొల్చారం వైపు కూడా మరికొంత భూమి సేకరణకు ఎంత డబ్బు కావాలో సమీక్షించి తొందరగా అవార్డు పాస్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ హరీష్‌ను మంత్రి ఆదేశించారు.

నెట్‌వర్క్ లైనింగ్ కోసం రూ. 55 కోట్ల ప్రతిపాదనలు

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఘణపురం ప్రధాన కాలువ లైనింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం నీళ్ల ద్వారా చిట్ట చివరి భూములకు కూడా సాగునీరందించడానికి ఇంకా మిగిలిపోయిన టేలేండ్‌లో ఉన్న ప్రధానమైన కాలువలతో పాటు, డిస్త్రిబ్యూటరీ నెట్‌వర్క్ లైనింగ్ కోసం 55 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. హల్దీ ప్రాజెక్టు ఆధునినీకరణ కోసం, కాలువలు, సిమెంట్ లైనింగ్ కోసం 25 కోట్ల రూపాయల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఘణపురం, హల్దీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. హల్దీ ప్రాజెక్టు మీద 6 చెక్‌డ్యాంలు, మంజీరా మీద 9 చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టి ఇంతవరకు 7 చెక్ డ్యాములు నిర్మించామని, మిగిలిన చెక్ డ్యాములను కూడా యుద్ధప్రాతిపదికన ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను రెండు, మూడు రోజులల్లో పూర్తి చేయాలని అధికారులను హరీష్‌రావు ఆదేశించారు.

అందుబాటులోకి ఆర్టీపిసీఆర్ ల్యాబ్

కరోనా పరీక్షల కోసం జిల్లాలో ర్యాపిడ్ టెస్టులు మాత్రమే చేసేవారని అందులో భాగంగా జిల్లాలో ఆర్టీపిసీఆర్ ల్యాబ్ ను ఆదివారం ప్రారంభించడం జరిగిందని, నేటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్, రెమిడిసివిర్, మందుల కొరత ఉందా అని వైద్యాధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోగుల దగ్గరకు వెళ్లి ఆత్మీయతతో పలకరించండని, అదే వారికి సగం ధైర్యం ఇస్తుందని ఆయన సూచించారు. అనంతరం పిల్లి కొట్టాల్ లో నిర్మిస్తున్న ఎసిహెచ్ ఆసుపత్రికి వెళ్లే రహదారిని పరిశీలించి వెడల్పుగా బిటి రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ జి.రమేష్, పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్ర గౌడ్, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్య రెడ్డి, నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాస రావు, ఆర్‌డిఓ సాయి రాం, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News