కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ వెల్లడి
న్యూఢిల్లీ : ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కొవిడ్ టీకాలు అందుబాటు లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. మంగళవారం బిజెపి పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపిలకు చెప్పినట్టు తెలుస్తోంది. చిన్నారుల టీకా కోసం భారత్ బయోటెక్ జైడస్ క్యాడిలా సంస్థలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వీటిలో 12 18 ఏళ్ల వయసు వారి కోసం జైడస్ క్యాడిలా ఇప్పటికే ప్రయోగాలు పూర్తి చేసింది. భారత్ బయోటెక్ మాత్రం 2 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలపై మూడో దశ ప్రయోగాలు మూడు దశల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆరేళ్లకు పైబడిన వారికి రెండు డోసులు ఇచ్చి పరీక్షించింది. వీటి ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వ్యాక్సిన్ కూడా సెప్టెంబర్ నాటికి అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. మోడెర్నా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు అమెరికా, ఐరోపా దేశాలు అనుమతి ఇచ్చాయి. ఇక్కడ చిన్నారులకు టీకా పంపిణీ కూడా మొదలయ్యింది. భారత్‌లో ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన వారికి 44కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.