ప్రభుత్వ శాఖలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: అర్హులైన ఉద్యోగాలు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ ప్రికాషన్ డోసులు సమకూర్చేందుకు వీలుగా అన్ని ఉద్యోగ ప్రదేశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహించాలని కేంద్రం అన్ని శాఖలను ఆదేశించింది. ప్రికాషన్ డోసుకు అర్హులైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ వారీగా విడివిడిగా రూపొందించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ తన తాజా ఉత్తర్వులో ఆదేశించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్‌ను ప్రారంభించింది. రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తేదీ నుంచి ఆరు నెలలు(25 వారాలు) పూర్తి చేసుకున్న అర్హులైన ప్రజలందరికీ ప్రికాషన్ డోసును ఉచితంగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు 75 రోజుల్లోపల అన్ని ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని అన్ని శాఖలను కేంద్రం ఆదేశించింది.