12.3 లక్షలమందికి మొదటి డోస్ పంపిణీ
న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం 3 గంటలవరకల్లా 12.3 లక్షలమంది చిన్నారులకు కొవిడ్19 వ్యాక్సిన్ మొదటి డోసుల పంపిణీ పూర్తయింది. సోమవారం(ఈ నెల 3) నుంచి 1518 ఏళ్ల వయసు టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ టీకాలు తీసుకున్న టీనేజర్లతో ఆయన ముచ్చటించారు. టీకాలు తీసుకునేలా తమ స్నేహితుల్ని ప్రోత్సహించాలని టీనేజర్లకు సూచించానని మాండవీయ ట్విట్ చేశారు. సోమవారం సాయంత్రం 3 గంటల వరకు కొవిన్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా 39.88 లక్షలమంది 1518 ఏళ్ల చిన్నారులు వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దేశంలో ఒమిక్రాన్ ఉధృతి పట్ల ఆందోళన నేపథ్యంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఆదివారం కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, సంబంధిత ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో పెద్దలకు కూడా టీకాలు ఇస్తున్న చోట టీనేజర్లకు ప్రత్యేకంగా సైట్లనూ, క్యూలైన్లనూ ఏర్పాటు చేయాలని మాండవీయ వారికి సూచించారు. టీనేజర్లకు ప్రస్తుతం భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్గిన్‌ను పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2007లో లేదా అంతకుముందు జన్మించినవారు వ్యాక్సినేషన్‌కు అర్హులని తెలిపింది. కొవిన్ యాప్ ద్వారా లేదా ప్రత్యక్షంగా సైట్‌కు వెళ్లిగానీ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఆధార్ కార్డులేనివారు విద్యార్థిగా పాఠశాల లేదా కళాశాల నుంచి పొందిన జనన ధ్రువీకరణతో కూడిన ఐడి కార్డు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించింది.