రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో 15-18ఏళ్ల లోపు చిన్నారులకు నేటి నుంచి వ్యాక్సినేషన్
రాష్ట్రంలోని 22,78,683 మంది అర్హులు
ప్రైవేట్‌లోనూ అనుమతి
10నుంచి హెల్త్‌వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు, 60ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసుకు ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : పిల్లలకు కొవిడ్ టీకా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునే సేవలు శనివారం నుంచే ప్రారంభమయ్యాయి. 2007 లేదా అంతకుముందు పుట్టిన పిల్లలే టీకాకు అర్హులు. రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్లలోపు వయసు పిల్లలు సుమారు 22,78,683 మంది ఉన్నారు. ఈ మేరకు అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు 12 మునిసిపల్ కార్పొరేషన్లలో కొవిన్ పోర్టల్ ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆ 12 కార్పొరేషన్ల వివరాలు కొవిన్ పోర్టల్‌లో ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పిల్లలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని, నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పిహెచ్‌సిలకు తీసుకెళ్లి టీకా వేయించవచ్చని పేర్కొంది.
సోమవారం నగరంలో 95 కేంద్రాలలో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ డిఎంహెచ్‌ఒ డాక్టర్ వెంకటి తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లోనూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పిహెచ్‌సిలలో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. అయితే కొవిడ్ పోర్టల్‌లో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ పట్టణాలు మినహాయిస్తే కొవిన్ పోర్టల్‌లో మిగిలిన ప్రధాన పట్టణాల్లో ఎక్కడా స్లాట్ చూపించలేదు. అయితే ఒకటి రెండు రోజుల్లో మిగిలిన పట్టణాల్లోనూ వ్యాక్సినేషన్ కేంద్రాల జాబితాను కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. దాంతో ఇతర ప్రాంతాల్లోనూ కొవిన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు గుర్తింపు కోసం వారి ఆధార్ కార్డులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు వారి తల్లిదండ్రులతో టీకా కేంద్రాలకు వెళ్లాలి. పిల్లలకు భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కొవ్యాక్సిన్ టీకాను మాత్రమే అందిస్తారు. వైద్యుల పర్యవేక్షణలో టీకా తీసుకున్నాక.. 30 నిమిషాల పాటు టీకా కేంద్రంలోనే ఉండాలి. వారిలో ఎటువంటి దుష్పరిణామాలు లేవని గమనించాకే అక్కడి నుంచి వైద్యులు పంపుతారు. 28 రోజుల తర్వాత విధిగా టీకా రెండో డోసు తీసుకోవాలి.
ప్రైవేటులో ఒక్కో డోసు రూ.1,200పైనే
నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లల వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనివారం కొవిన్ పోర్టల్‌లో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లల టీకా కేంద్రాలు ఉన్నట్లు కనిపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో వ్యాక్సిన్ డోసుకు రూ.1,200 నుంచి రూ.1,410 వరకు నిర్ణయించారు. పెద్దలకు ఇస్తున్న మాదిరిగానే పిల్లలకు కూడా అంతే (0.5 ఎంఎల్) డోసు ఇస్తామని వైద్యవర్గాలు తెలిపాయి.
10 నుంచి బూస్టర్ డోసు
రాష్ట్రంలో హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ గ్రూపులకు చెందిన రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు పూర్తయిన తర్వాతనే బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.