జెనీవా : వేర్వేరు సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లను కాంబినేషన్ రూపంలో తీసుకోవడం ప్రమాదకరమని, ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాధన్ హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఎవరూ తమకు నచ్చిన రీతిలో వ్యాక్సిన్లు తీసుకోవద్దని, ప్రజారోగ్య వ్యవస్థలు సూచించిన టీకాలు మాత్రమే వేసుకోవాలని ఆమె సూచించారు. జెనీవా నుంచి ఆన్‌లైన్‌లో ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్లను మిక్సింగ్ చేయడం లేదా మేచింగ్ చేయడం వల్ల కలిగే పరిణామాలపై ఎలాంటి డేటా అందుబాటులో లేదని, అందువల్ల ఇది చాలా రిస్కుతో కూడుకున్న విషయమని చెప్పారు.
ఈ అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయని, వ్యాక్సిన్ మిక్సింగ్ వల్ల కలిగే రోగ నిరోధక శక్తి, రక్షణ అంశాలను పరిశీలించాల్సి ఉందని, ఈమేరకు డేటా కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ప్రజలే తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని అన్నారు. ఇప్పటికే పలు దేశాధినేతలు రెండు వేర్వేరు టీకాలు తీసుకున్నారు. ఇటీవలే జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి, తదితర నేతలు వేర్వేరు టీకాల డోసులు తీసుకున్నారు. కెనడా, బ్రిటన్‌తోపాటు ఐరోపా సమాఖ్య లోని కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ మిక్సింగ్ అమలు అయింది కూడా. స్పెయిన్, దక్షిణ కొరియాల్లోనూ ఈ పద్ధతి అవలంబించారు.