మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కొవిడ్ సెకండ్ డోసు కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 16వ తేదిన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ షురూ కాగా, ఆ రోజు 3962 మంది హెల్త్‌కేర్ వర్కర్లు టీకా తీసుకున్నారు. వారందరికీ శనివారం నుంచి టీకా రెండవ డోసు పంపిణీ జరగనుంది. ఇప్పటికే వీరి ఫోన్లకు సందేశాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. అంతేగాక జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్సు టీంలకు కూడా ఆదేశాలిచ్చినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న హెల్త్‌కేర్ సిబ్బందికి ఈనెల 22వ తేదితో రెండవ డోసును పూర్తి చేయనున్నట్లు హెల్త్‌డిపార్ట్‌మెంట్ పేర్కొంది. మొదటి డోసు ఏ కంపెనీకి చెందిన టీకా తీసుకుంటే, రెండవ డోసు కూడా అదే ఇవ్వనున్నారు. అంతేగాక తొలిడోసు తీసుకున్న కేంద్రంలోనే రెండవ డోసులు ఇస్తామని వైద్యశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో 400 ఏఇఎఫ్‌ఇ కేసులు…
రాష్ట్రంలో మొదటి డోసు తీసుకున్న వారిలో ఇప్పటి వరకు సుమారు 400 మందికి (ఏఇఎఫ్‌ఐ)మైనర్ రీయాక్షన్లు రాగా, మరో 20 మంది సీరియస్ కండీషన్‌లో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరేవరికీ ప్రాణపాయం లేదని ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. కానీ సివియర్, సీరియస్ కేసులకు రెండో డోసు ఇవ్వొద్దని రాష్ట్ర వైద్యశాఖకు కేంద్రం సూచించినట్లు సమాచారం. తదుపరి ఆదేశాలిచ్చే వారకు వారి ఆరోగ్య పరిస్థితిపై మానిటరింగ్ చేయాలని కేంద్రం సూచించింది. మరోవైపు ఇక నుంచి ఆదివారంతో పాటు పబ్లిక్ సెలవులు మినహా మిగతా అన్ని రోజులు టీకా ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్ల వ్యాక్సినేషన్ 33 శాతమే….
రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్ వర్కర్ల వ్యాక్సినేషన్ శాతం కేవలం 33 శాతమేనని అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్‌కేర్ వర్కర్లు కలిపి 64 శాతం మంది టీకా తీసుకోగా ఫ్రంట్‌లైన్ వర్కర్లు దానిలో సగం శాతం మాత్రమే తీసుకోవడం ఆశ్చర్యకరం. అయితే కొవిన్‌లో నమోదై ఇప్పటి వరకు టీకా తీసుకొని ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు మాప్ ఆప్ రౌండ్ కింద ప్రత్యేక రోజు కేటాయించి టీకాను ఇస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా శుక్రవారం 415 సెంటర్లలో 31,034 మందికి టీకా ఇవ్వాలని లక్షం పెట్టుకోగా, కేవలం 7591 మంది మాత్రమే టీకా తీసుకోగా, ఒకరికి మైనర్ రీయాక్షన్ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,77,825 మందికి వ్యాక్సిన్ తొలి డోసు పంపిణీ పూర్తయిందని డిహెచ్ పేర్కొన్నారు.
Vaccine Second dose from saturday in Telangana