ఆకలి కోరలకు 30 లక్షల మందిని ఆహుతిచ్చిన 1943 నాటి బెంగాల్ మహమ్మారి కరువుకు ఆహార కొరత కారణం కానేకాదని, అప్పటి యుద్ధ కాల బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విధానాలు సృష్టించిన కృత్రిమ కొరత వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి వీధులు శవాల గుట్టలయ్యాయని లోతైన పరిశోధనలు నిగ్గు తేల్చాయి. అప్పుడక్కడ వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయని, పంటలు బాగా పండాయని అవి వెల్లడించాయి. కాని చర్చిల్ దేశంలోని ఆహార ధాన్యాలను విశేష స్థాయిలో తరలించుకుపోడంతో ఇక్కడ దొంగ నిల్వలు పెరిగిపోయి ధరలు ఆకాశాన్నంటి లక్షలాది సామాన్య జనం ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇప్పుడు దేశంలో కరోనా మందుకు ఇదే దుస్థితి దాపురించినట్టు వార్తలు చెబుతున్నాయి. డామన్‌లో గల బ్రక్ ఫార్మా సంస్థ వేలాది వయల్స్ రెమ్‌డిసివిర్ (కరోనా మందు) ను విదేశాలకు పంపించడం కోసం దాచి ఉంచిందని ఉప్పందండంతో దాని డైరెక్టర్ ఒకరిని ముంబై పోలీసులు అరెస్టు చేసి దాదాపు గంట సేపు ప్రశ్నించారు.
రెమ్‌డిసివిర్, కొవిడ్ టీకాలు, ఆక్సిజన్ సిలిండర్లు వంటి అత్యవసర ఔషధాల దొంగ నిల్వలపై విరివిగా దాడులు జరపాలని కేంద్ర హోం శాఖ ఎట్టకేలకు నిర్ణయించింది. రాష్ట్రాల పోలీసుల సమన్వయ సహకారాలతో కూడిన వ్యూహాన్ని సిద్ధం చేసిందని వార్తలు చెబుతున్నాయి. అంటే దేశ ప్రజల ప్రాణాలను విచ్చల విడిగా కాటేస్తున్న కరోనా పడగ నీడలో కూడా మృత్యు వర్తకం జుగుప్సాకరంగా సాగుతున్నదని భావించడానికి వెనుకాడనవసరం లేదు. కరోనా సెకండ్ వేవ్ రోగులకు ఆసుపత్రుల్లో పరుపులు దొరకడం లేదు. ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేసిన వారినే ప్రైవేటు ఆసుపత్రులు అనుమతిస్తున్నాయని వార్తలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్మశానాలకు తీరిక చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో దిక్కుమొక్కులేని సాధారణ జనం, చేతికీ నోటికీ దూరాన్ని తొలగించుకోడం కోసమే రెక్కలు ముక్కలు చేసుకునే కష్టపాటు ప్రజలు ఎటువంటి దుస్థితిలో ఉంటారో ఊహించవచ్చు. వారికి కొవిడ్ సోకితే ఆదుకునే వారు ఎవరు? వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని, అదనపు సరఫరాలతో ఆదుకోవాలని పది పన్నెండు రోజుల క్రితమే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మొరపెట్టుకున్నది.
కేంద్రం ఆ మొరను వినిపించుకోకపోగా ఎదురు దాడితో దానిపై విరుచుకు పడింది. టీకా కొరత అనేది పచ్చి అబద్ధమని, మహారాష్ట్ర ప్రభుత్వం కావాలని దీనిని రాజకీయం చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ప్రత్యారోపణకు బరి తెగించింది. ఒక్క మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ తదితర బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు కూడా టీకా కొరత గురించి ఆర్తనాదాలు చేస్తున్నాయి. గుజరాత్‌లో కూడా వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని సమాచారం. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రోగుల అవసరాలను నిర్లక్షం చేసి ఉత్తరప్రదేశ్‌కు రెమ్‌డిసివిర్ మందును సరఫరా చేసిందని తెలుస్తున్నది.
బెడ్లు, అంబులెన్సుల కొరత కూడా ఏర్పడింది. ఏడాది క్రితం కరోనా ప్రపంచమంతటినీ పీడించి లక్షల మందిని బలి తీసుకున్నప్పటి పరిస్థితికి ఇప్పటికి మన దేశంలో ఏ మాత్రం మెరుగుదల కనిపించడం లేదు. అప్పుడు బెడ్లు, తక్షణ వైద్య సహాయ సేవల దుర్భిక్షం ఇలాగే మృత్యు తాండవం చేసింది. టీకా అందుబాటులోకి వచ్చిందని ఇప్పుడు సంబరపడుతుంటే దానికి కొరత దాపురించింది. ఈ దుస్థితికి విరుచుకుపడకుండా చూసి ఉండవలసిన అత్యవసర బాధ్యత గల దేశ పాలకులు ముమ్మర ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఎప్పటి నుంచో నిధుల కొరతను ఎదుర్కొంటున్న దేశీయ టీకా ఉత్పత్తి సంస్థలకు ఇప్పుడిప్పుడే రుణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇల్లు కాలుతుంటే బావి తవ్వకం మొదలు పెట్టినట్లున్నది.
సెకండ్ వేవ్ కరోనా యువత ప్రాణాలపై గురి పెట్టినట్లు కొంత కాలం క్రితమే నిపుణులు హెచ్చరించారు. వారికి ఇప్పటికీ టీకా పంపిణీ కావడం లేదు. ఇంకో వైపు ఎన్నికల ప్రచార సభలకు జనాన్ని వేలు, లక్షల సంఖ్యలో తరలించుకుపోతున్నారు. మరొక వైపు లక్షలాది మంది భుజాలు ఒరుసుకొని కుంభమేళా స్నానాలు చేస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తల గురించి హెచ్చరించి ప్రతి ఇద్దరి మధ్య దూరం పాటించేటట్టు, మాస్కులు విధిగా ధరించేటట్టు చూసి తీరవలసిన పాలక పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు ఓట్ల కోసం ఆ బాధ్యతను గాలికి వదిలేస్తున్నారు. ఇలా ప్రజల నుంచి పాలకులు, పార్టీల నాయకుల వరకు అన్ని స్థాయిల్లోనూ అశ్రద్ధ, అజాగ్రత్త పెరిగి పేరుకుపోతున్నది. మొదటి అనుభవం వల్ల గుణపాఠం నేర్చుకొని ఏడాది గడిచిపోయినా జాగ్రత్తలు తీసుకోడంలో మనం గుండు సున్నాను మరపిస్తున్నాము. బాధ్యత గల సుపరిపాలన కొరవడిన చోట ప్రాణాలను బలి తీసుకునే మహమ్మారి రోగాలకు కొరత రాదని రుజువవుతున్నది.