న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ వరకల్లా భారత పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలకు జవదేకర్ కౌంటరిచ్చారు. డిసెంబర్ వరకల్లా కనీసం 108 కోట్ల భారతీయులకు టీకా కార్యక్రమం పూర్తవుతుందని జవదేకర్ అన్నారు. ఇప్పటి వరకు దేశంలోని 3 శాతం మందికి మాత్రమే రెండు డోసుల టీకాలందాయని రాహుల్ విమర్శించగా జవదేకర్ వివరణ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్యశాఖ గత వారం చేసిన ప్రకటనను జవదేకర్ గుర్తు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ వరకల్లా దేశంలో 216 కోట్ల డోసుల కొవిడ్19 టీకాలు ఉత్పత్తి అవుతాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దాని అర్థం కనీసం 108 కోట్ల భారతీయులకు రెండు డోసుల టీకాలు లభిస్తాయని అంటూ జవదేకర్ సమాధానమిచ్చారు. వ్యాక్సినేషన్ విషయంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని జవదేకర్ తెలిపారు.