సూచనప్రాయంగా వెల్లడించిన
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్
న్యూఢిల్లీ : దేశంలో 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని , అప్పటికి 15 -18 ఏళ్ల లోపు టీకాలు పూర్తయ్యే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ( ఎన్‌టీఎజీఐ) కి చెందిన కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా సోమవారం వెల్లడించారు. జనవరి 3 న 15 18 ఏళ్ల లోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు. 15- 18 ఏళ్ల వారి జనాభా 7.4 కోట్లు ( 7,40,57,000) ఉండగా, వీరిలో 3.45 కోట్ల మంది కొవాక్సిన్ మొదటి డోసు పొందారని, జనవరి నెలాఖరుకు మొదటి డోసు పూర్తవుతుందని, అలాగే వీరికి రెండో డోసు మరో 28 రోజుల్లో ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని భావిస్తున్నట్టు అరోరా వివరించారు. వీరందరికీ డోసులు ఇవ్వడం పూర్తయితే 12- 14 ఏళ్ల పిల్లలకు మార్చిలో టీకా డ్రైవ్ ప్రారంభించడానికి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.