Wednesday, January 22, 2025

భద్రాచలంలో వైభవంగా వైకుంఠద్వార దర్శనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే భద్రాచలంలో సోమవారం తెల్లవారుఝామున 5 గంటలకు శ్రీసీతారామచంద్రస్వామివారి వైకుంఠ ద్వారదర్శనం కన్నుల పండుగగా జరిగింది. భక్తుల రామనామస్మరణతో ప్రారంభమై జయజయధ్వానాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, జేగంటల సవ్వడుల నడుమ ఉతర్తద్వారం తెరచుకుంది. వైకుంఠాన్ని తలపించేలా దూప,దీపాల పొగల నడుమ గరుడారూఢుడై సాక్షాత్కరించిన సీతారామచంద్రస్వామిని దర్శించడానికి భక్తకోటికి రెండు కళ్ళు చాలలేదు. ఆదర్శమూర్తి, ఆరాధ్యదైవం అయిన రామయ్యను ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడంతో తమ జన్మ ధన్యమైందని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. కమనీయమైన స్వామి దర్శనం చేసుకుని భక్తులు ముక్కోటి ఉత్సవంలో ఊయలలూగారు.

అర్ధరాత్రి నుండే స్వామివారికి రామాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ముందుగా భక్తరామదాసు గౌరవార్ధం స్థానిక తహశీల్ధార్ ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. బాలబోగం సమర్పించారు. స్వామివారిని గరుడ వాహనంపై అధిష్టించి ఉత్త్తర ద్వారానికి తీసుకొచ్చారు. గజ వాహనం పై సీతమ్మవారిని, ఆంజనేయస్వామి వాహనంపై లక్ష్మణస్వామిని బోయలు మోసుకొచ్చారు. రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, అధర్వణ వేదాలను పఠించారు. 108 వత్తులతో నక్షత్ర హారతి ఇచ్చి శరణాగతి దండకం చదివి ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం వైకుంఠద్వారం గుండా భక్తులను స్వామి దర్శనం కోసం తీసుకెళ్లారు. వీవీఐపీ, పీఐపీలతో పాటు టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు కూడా ఈ దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో శివాజీ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసారు. చాందినీ వస్త్రాలతో పందిళ్లు నిర్మించారు.

Vaikuntha Dwaradarshan was held as feast for eyes

తిరువీధి సేవ…
ఉత్తర ద్వారదర్శనం అనంతరం భద్రాద్రిరాముడికి తిరువీధి సేవ నిర్వహించారు. గరుడ వాహనం పై వైకుంఠరామయ్య, ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై సీతమ్మతల్లి, ఆంజనేయుడే వాహనంగా చేసుకుని లక్ష్మణస్వామి తిరువీధి సేవలో భక్తులకు దర్శమిస్తూ కదిలారు. ఈ తిరువీధిసేవ మాఢవీధుల మీదుగా తాతగుడి వద్దకు చేరుకుంది. తాతగుడి వద్ద గోవిందరాజస్వామి వారి ఆలయంలో రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉత్సవానికి తరలివచ్చిన ప్రముఖులు..
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని రామయ్య తెప్పోత్సవంతో పాటు ముక్కోటి ఉత్తరద్వార దర్శనం చూడటానికి పలువురు ప్రముఖులు భద్రాచలం తరలివచ్చారు. ఈ అమితానంద ఘట్టాన్ని తనివితీరా వీక్షించడానికి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య,ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ డా. వినీత్, ఐటిడిఎ పీవో పోట్రు గౌతమ్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News