Friday, January 10, 2025

భద్రాద్రిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవం

- Advertisement -
- Advertisement -

ఉత్తర ద్వారంలో భద్రాద్రి రామయ్య భక్తులకు దర్శనం తిలకించి తరించిన భక్తజనం.

వైకుంఠ రాముడిగా భక్తులకు అనుగ్రహం.

రామనామ స్మరణలతో మారు మోగిన భద్రాద్రి.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు జై శ్రీరామ్… జై జై శ్రీరామ్ అంటూ జయ జయధ్వానాలు చేశారు. వేదపండితులు ముక్కోటి విశిష్టతను వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీ సెక్టార్ లతో పాటు ఇతర సెక్టార్లలోని భక్తులు వేడుకను తిలకించారు. స్థానాచార్యులు భక్తులకు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. అర్చకులు 108 ఒత్తులతో వెలిగించిన హారతినికి భక్తులు అందుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం తర్వాత ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ప్రతి సెక్టార్ లో ఏర్పాట్లు పర్యవేక్షణ కు జిల్లా అధికారులను, లైజన్ అధికారులను నియమించారు. బందోబస్తు ఏర్పాట్లును ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షించారు. వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి సతీమణి మాధురి రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం, పినపాక, ఇల్లందు, శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్ రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్ ఐటిడిఎ పిఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ దంపతులు, ఎఎస్పీ విక్రాంత్ సింగ్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్. దేవస్థానం ఈ ఓ రమాదేవి తదితరులు హాజరయ్యారు.

Vaikuntha ekadashi in Bhadradri

గరుడ వాహనరూపుడైన రామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చ కులు స్వామివారికి విశేష ఆరాధన, శ్రీరామ పదాక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వే చాలు, గరుడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరణాగతి గజ్జగరుడ దండం, భక్తరామదాసు రచించిన దాశరథి శతకాన్ని పఠించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శత హారతినిచ్చారు. భక్తరామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీని వాస్ మూలవరులకు స్నపనం నిర్వహించారు.

ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం వైకుంఠరాముడు తిరువీధి సేవకు తరలివెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అందా కమ్మ వారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మ వారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తుల తిరువీధి సేవ సాగింది. మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేదమం త్రోచ్చారణ మధ్య శోభాయమానంగా సాగింది. రాపత్తు ఉత్సవాలు ప్రారంభం.

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ .

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం విజయవంత కావడం పట్ల జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News