Wednesday, January 22, 2025

గొప్ప రాజకీయవేత్త వాజ్‌పేయీ!

- Advertisement -
- Advertisement -

మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్‌పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్‌పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. గ్రాడ్యుయేషన్, విక్టోరియా (నేడు లక్ష్మీబాయి)లో, యం.ఎ పొలిటికల్ సైన్స్ దయానంద్ ఆంగ్లో వేదిక్ కళాశాల కాన్పూర్‌లో జరిగింది. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ లో ఆయన తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టయిన సందర్భంలో వాజ్‌పేయీకి తొలిసారిగా రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. బిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు నెరపనని రాతపూర్వకమైన హామీ యిచ్చిన తరువాతనే ఆయనను విడిచిపెట్టారు.

1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ అనే హిందూ దక్షిణ పక్ష రాజకీయ పార్టీలో పని చేయడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజ్‌పేయీని ఆర్.ఎస్.ఎస్ నియమించింది. ఇది ఆర్.ఎస్.ఎస్‌తో కలిసి పని చేస్తున్న రాజకీయ పార్టీ. ఆయన ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న పార్టీ ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుయాయిగా, సహాయకునిగా మారారు. 1954లో కశ్మీరులో కశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు వాజ్‌పేయీ ఆయన వెంటే ఉన్నారు. ముఖర్జీ ఈ నిరాహారదీక్షా సమయంలోనే కశ్మీరు జైలులో మరణించారు. 1957లో వాజ్‌పేయీ బల్రామ్‌పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆయన వాగ్ధాటి మూలంగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏదో ఒకరోజు వాజ్‌పేయీ దేశ ప్రధాని అవుతారని ఊహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ మొత్తం బాధ్యత వాజ్‌పేయీపై పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎదిగారు. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్ కృష్ణ అద్వానీలతో కలిసి జనసంఘ్‌ను జాతీయ స్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించారు. 1975 1977ల మధ్య ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేక మంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు అయ్యారు. 1977లో సంఘ సంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు వాజ్‌పేయీ జనసంఘ్‌ను కొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి, జనతా పార్టీలో విలీనం చేశారు.

1977 సార్వత్రిక ఎన్నికలలో న్యూఢిల్లీ నుండి జనతా పార్టీ విజయం తరువాత వాజ్‌పేయి మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయేనాటికి వాజ్‌పే యీ స్వతంత్రంగా, గౌరవప్రదమైన రాజకీయవేత్తగా, అనుభవజ్ఞుడైన నాయకునిగా ఎదిగారు. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా రాజీనామా చేసిన కొద్ది రోజులకే జనతా పార్టీ కూడా విచ్ఛిన్నమైపోయింది. జనసంఘ్ నాయకులు జనతా పార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించినా జనతా పార్టీలోని వివిధ వర్గాల మధ్య అంతర్గత విభేదాల వల్ల విసిగిపోయి సంకీర్ణంలో నుండి బయటకు వచ్చింది.

వాజ్‌పేయీ, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె. అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్‌లను కలుపుకొని 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచి, మొట్టమొదటి అధ్యక్షునిగా పని చేశారు. జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెసు ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించారు సానుకూల జాతీయవాద భావజాలపు ప్రభావంతో బిజెపి 1995 లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బి.జె.పి అవతరించింది. ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వాజ్‌పేయీని ప్రభుత్వంఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. వాజ్‌పేయీ భారత 10వ ప్రధానమంత్రి అయ్యారు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమై, వాజ్‌పేయీ ప్రభుత్వం సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు.

1974లో తొలిసారిగా ‘పోఖ్రాన్-’ అణుపరీక్ష జరిపిన భారతదేశం మళ్ళీ 24 సంవత్సరాల తరువాత 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను ‘పోఖ్రాన్- II’ గా వ్యవహరిస్తారు. వాజ్‌పేయీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి. భారతదేశపు అణు పరీక్షలను రష్యా, ఫ్రాన్స్ మొదలైన కొన్ని దేశాలు సమర్థించాయి. అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, ఐరోపా దేశాలు భారతదేశానికి సమాచారం, వనరులు, సాంకేతి కాంశాలలో సహాయంపై ఆంక్షలు విధించాయి. తమ అణు సామర్ధ్యాన్ని అణ్వాయుధంగా మలచే విషయమై భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ ఆంక్షలు సమర్ధవంతంగా నిరోధించలేకపోయాయి. వాజ్‌పేయీ ప్రభుత్వం ఈ చర్యలను ముందే పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా ప్రణాళిక ఏర్పరుచుకున్నది. వాజపేయి కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్థాన్‌తో నూతన శాంతి ఒప్పందం కోసం పాకిస్థాన్‌ను ఆహ్వానించారు. తత్ఫలితంగా కుదిరిన లాహోర్ ఒప్పందం, ద్వైపాక్షిక చర్చలను కొనసాగించాలని, వర్తక సంబంధాలు విస్తరించాలని, సహృద్భావం పెంపొందించాలనీ ఉల్లేఖించింది.

అణ్వాయుధ రహిత దక్షిణాసియా అనే దార్శనిక లక్ష్యాన్ని ఉద్బోధించింది. ఈ ఒప్పందం 1998 అణుపరీక్షల తర్వాత ఇరుదేశాలలోనేకాక, దక్షిణాసియాలోను ఇతర ప్రపంచంలోనూ నెలకొన్న ఉద్రిక్తతలను ఉపశమింపజేసింది. కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య మే జులై 1999లో కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోను, మరికొన్ని సరిహద్దుల వద్దనూ జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు కశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్‌ఒ సి) దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధం లో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువైంది. ఆధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది.

అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధానికిది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో ప్రదేశంలో యుద్ధం జరగడం వల్ల ఇరుపక్షాలకూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది. మొదటిది చైనా – సోవియట్‌ల మధ్య 1969లో జరిగింది. వాజ్‌పేయీ ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, ఉద్యోగుల కోపానికి గురైంది. భారతీయ ఆర్థిక రంగాన్ని సమూలంగా పరివర్తనం చేసి, విస్తరించే దిశగా వాజ్‌పేయీ వ్యాపార రంగానికి మద్దతునిస్తూ, స్వేచ్ఛా విఫణి సంస్కరణలను ప్రోత్సహించారు.గత ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించిన ఈ సంస్కరణలు, 1996లో అస్థిర ప్రభుత్వాలు పాలనలో ఉండటం వలన, 1997లో సంభవించిన ఆసి యా ఆర్థిక సంక్షోభం వలనా నిలిచిపోయాయి. పోటీతత్వం పెంపొందించడం, సమాచార సాంకేతికత, ఇతర సాంకేతిక పరిశ్రమలకు అదనపు పెట్టుబడి, మద్దతు సమాకూర్చడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వర్తక, పెట్టుబడులు, వాణిజ్య చట్టాలపై నియంత్రణ సడలించడం వంటి చర్యలన్నీ విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేసి ఆర్థికరంగ విస్తరణకు శ్రీకారం చుట్టాయి. 2001 డిసెంబర్ 13 న పార్లమెంట్‌పై తీవ్రవాదులు జరిపిన దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయీ నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయనకు భారతీయ సంగీతం, నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజ్‌పేయీకి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం. 1992లో పద్మవిభూషణ్, 1993లో కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం, 1994లో లోకమాన్య తిలక్ పురస్కారం, 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం, 1994లో భారత రత్న గోవింద్ వల్లభ్‌పంత్ పురస్కారాలతో గౌరవించబడ్డారు. భారత మాజీ ప్రధాని డా. మన్‌మోహన్ సింగ్ వాజ్‌పేయీ ఆరోగ్యం గూర్చి తరచుగా తెలుసుకొనేవాడు. ఆయన ప్రతి పుట్టిన రోజున స్వయంగా కలిసి శుభాకాంక్షలు అందజేసేవారు. 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఢిల్లీలో మరణించారు.

ఆళవందార్
వేణు మాధవ్
8686051752

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News