న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రైవేట్ కార్యదర్శికి పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్, విద్యావేత్త శక్తి సిన్హా సోమవారం కన్నుమూశారు. అయితే ఆయన మరణానికి కారణం తెలియరాలేదు. సిన్హా అకాల మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్త చేస్తూ ఆయనను గొప్ప మేధావిగా కీర్తించారు. శక్తి సిన్హాను తాను నిన్ననే(ఆదివారం) కలుసుకుని గొప్ప అనుభూతులను పంచుకున్నానని, జీవితం ఎంత అశాశ్వతమైందో దీన్ని బట్టి అర్థమవుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మీడియా కార్యదర్శి అజయ్ సింగ్ నిర్వేదం వ్యక్తం చేశారు. 1979 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అయిన శక్తి సిన్హా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ డైరెక్టర్‌గా గతంలో పనిచేశారు. సిన్హా మృతి పట్ల ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1996-1999 మధ్య కాలంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ప్రైవేట్ కార్యదర్శిగా సిన్హా పనిచేశారు. వాజ్‌పేయి: ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు.