Sunday, November 24, 2024

రాష్ట్ర బిసి కమిషన్

- Advertisement -
- Advertisement -

Vakulabharan appointed as Chairman of BC Commission

బిసి కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులుగా సిహెచ్ ఉపేంద్ర, సుభప్రద్ పటేల్ నూలి, కె.కిశోర్‌గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా సిహెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ బిసి కమిషన్‌ను పునరుద్దరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యమకారులు, సామాజిక సమీకరణలు పాటిస్తూ ప్రభుత్వం బిసి కమిషన్‌ను నియమించింది. గత బిసి కమిషన్‌లో పనిచేసిన సీనియర్ సభ్యులు అయిన వకుళాభరణంకు ఈ సారి ఛైర్మన్ పదవి వరించింది.

బిసి ఉద్యమ నాయకుడిగా, రచయితగా,మంచి వక్తగా వకుళాభవరణం సుపరిచితులు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు రెండు సార్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి 2019 వరకు ఒకసారి, మొత్తం మూడు సార్లు సభ్యులుగా పనిచేశారు. కమిషన్ విధివిధానాలు, చట్టాలు, రాజ్యాంగపై ఆయనకు ఉన్న విషయ పరిజ్ఞానం, అనుభవం దృష్టా ప్రభుత్వం ఆయనను ఛైర్మన్‌గా నియమించింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన వకుళాభరణం విద్యార్థి దశ నుంచే బిసి హక్కుల పోరాట నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకున్నారు.

ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎ(తెలుగు) పూర్తి చేశారు. ‘దశాబ్ది కవిత్వం(1191 నుంచి 2000 వరకు) పరిశీలన’ అంశంపై సిద్ధాంతవ్యాసం సమర్పించి డాక్టరేట్ పట్టాను పొందారు.వకుళాభవరణం బిసిలలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన దాసరి సామాజికవర్గానికి చెందినవారు. వకుళాభరణం నియామకంతో ఎంసిబిలకు ఉన్నత పదవి లభించినట్లయింది. వకుళాభవరణం అనేక సామాజిక అంశాలపై రచించిన వ్యాసాలు ప్రజల మన్ననలు పొందాయి. మంచి వక్తగా ఆయన ప్రసంగాలు ఎన్నో సామాజిక ఉద్యమ వేదికలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బిసి కమిషన్ సభ్యులుగా నియమితులైన వారిలో వికారాబాద్ జిల్లాకు అల్లంపల్లికి చెందిన శుభప్రత పటేల్ ఒయు నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.ఆయన వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం చెందినవారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్‌కు చెందిన సిహెచ్ ఉపేందర్ వృత్తి రిత్యా న్యాయవాది. ఆయన కమ్మరి సామాజిక వర్గానికి చెందినవారు. అంబర్‌పేటకు చెందిన కె.కిశోర్ గౌడ్ ఎంఎస్‌సి బి.ఇడి పూర్తి చేశారు. ఈయన గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. బిసి కమిషన్ ఛైర్మన్, సభ్యులందరూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రుణపడి ఉంటా : వకుళాభవరణం

బిసి కమిషన్ ఛైర్మణ్‌గా నియామకం చేసి తనకు అరుదైన గౌరవం, గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటానని డాక్టర్ వకుళాభవరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. ఈ హోదాతో వెనుకబడిన వర్గాలు సమున్నతంగా ఎదగడానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉదాత్తమైనవని, అవి క్షేత్రస్థాయిలో నిజమైన పేదలకు అందడంతో కమిషన్ తన కృషిని నిబద్ధతతో కొనసాగిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News