ఖమ్మం: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. వనజీవి రామయ్య గుండెపోటుతో మృతిచెందారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. దరిపల్లి రామయ్య తన జీవితంలో కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్యగా పేరు తెచ్చుకున్నాడు. మొక్కలు నాటడమే జీవిత లక్ష్యంగా ముందుగా సాగాడు. దాదాపు కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు.
గత యాబై సంవత్సరాలుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు నిర్వరామంగా కృషి చేశాడు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లడంతో పాటు చెట్లను సంరక్షించేవారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు మన రామయ్య. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతిలో వనజీవి రామయ్య గురించి పాఠ్యాంశంలో చేర్చింది. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య ఎప్పుడు చెబుతుండేవారు. రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.