Monday, December 23, 2024

వానాకాలం వ్యవసాయ ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

Vanakalam crop policy ready

కోటి 42లక్షల ఎకరాల్లో పంటల సాగు
75లక్షల ఎకరాల్లో పత్తి, 50లక్షల ఎకరాల్లో వరి,
15లక్షల ఎకరాల్లో కంది, 11.5లక్షల ఎకరాల్లో
ఉద్యాన పంటలు: మంత్రి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న వానాకాలానికి వ్యవసాయ ప్రణాళిక సిద్దమైంది. కోటి 42లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొంది. ఈ ఏడాది వివిధ రకాల పంటల దిగుబడి, మద్దతు ధరలు, మార్కెట్‌లో లభిస్తున్న ధరలు , వాతావరణ పరిస్థితులు తదితర అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన వానాకాల వ్యవసాయ పంటల సాగు ప్రాధమిక నివేదికపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం నాడు మంత్రుల నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని, ఈ ఏడాది రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 75లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, 50లక్షల ఎకరాల్లో వరి, 15లక్షల ఎకరాల్లో కంది పంటలు సాగు చేయించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. అదే విధంగా 11.5లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలిపారు.

రాష్ట్రంలో 1332 పత్తి ఎక్కువ సాగు చేసే క్లస్టర్లు, వెయ్యికి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించినట్టు తెలిపారు.క్లస్టర్ల వారీగా పంట ప్రణాళికలు సిద్దం చేశామని వెల్లడించారు.వానాకాలంలో ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్దం చేయాలని సూచించారు. మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలన్నారు.కల్తీలేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలని , కల్తీని నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని అధికారులను హెచ్చరించారు.రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేయాలని సూచించారు.పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దంగా ఉంచాలని , మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అన్ని ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. దీనికి సంబంధించి మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ తక్షణం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, పంటల ప్రణాళికపై జిల్లాల వారీగా ఏఈఓలకు శిక్షణ కల్పించాలని సూచించారు.ఆయిల్ పామ్ సాగు కోసం వ్యవసాయ ,- ఉద్యాన అధికారులు సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలన్నారు. దీని కోసం వ్యవసాయ ,- ఉద్యాన అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని ,రైతువేదికలను అవగాహన కోసం విరివిగా ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రైతుబంధు సమితులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.వానాకాలం సాగు ప్రణాళికపై మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి , విత్తనసంస్థ ఎండీ కేశవులు, మార్క్ ఫెడ్ ఎండీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News