61.94లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో వరి నాట్లు
46.42లక్షల ఎకరాల వద్ద ఆగిన పత్తి విస్తీర్ణం
జొన్న 37725 ఎకరాలు, సజ్జ 6-03 ఎ, మొక్కజొన్న 709758 ఎ, రాగి 642 ఎ, కంది 7.64లక్షల ఎ, పెసర 88655 ఎ, మినుము 47469 ఎ, ఉలవ 980ఎ, ఇతర పప్పు ధాన్యాలు 3738ఎ, నూనెగింజలు 4.10లక్షల ఎకరాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వానకాలం సీజన్‌కు సంబంధించిన పంటల సాగు అదును ముగిసింది. అన్ని రకాల పంటలు కలిపి బుధవారం నాటికి మొత్తం కోటి29లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. వ్యవసాయ శాఖ రికార్డుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా వరిసాగు విస్తీర్ణం రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు సీజన్‌కింద వరిసాగు విస్తీర్ణం 182.14శాతానికి చేరుకుంది. గత ఏడాది వానాకాలం వరిసాగు విస్తీర్ణం కంటే ఈ ఏడాది పది లక్షల ఎకరాలకు పైగానే అధికంగా వరినాట్లు పడ్డాయి. రాష్ట్రంలో వానాకాలం వరిసాగు సాధారణ విస్తీర్ణం 34.01లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది వాతావరణ అనుకూలత ,బారీ వర్షాలతో రిజర్వాయర్లు నిండిపోయి సాగునీటి లభ్యత పెరగటంతో వరిసాగు విస్తీర్ణం 55లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వానాకాలపు సీజన్ ప్రారంభ దశలో ముందస్తు అంచనాలు వేసుకొంది. అయితే బుధవారం నాడు వ్యవసాయ శాఖ విడుదల చేసిన పంటలసాగు నివేదికను బట్టి రాష్ట్రంలో ఇప్పటివరకూ 61,94,871ఎకరాల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. ఇంకా అక్కడక్కడా వరినాట్ల పనులు కొనసాగుతుండటంతో వరిసాగు విస్తీర్ణం 62లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 52,50,,017 ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఈ ఏడాది అనూహ్య రీతిలో వరిసాగు పెరిగింది.
111.19శాతం వానాకాలపు పంటల విస్తీర్ణం
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం అన్నిరకాల పంటలు కలిపి ఇప్పటి వరకూ 1,29,68,933ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మొత్తం 111.19శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. సాగులోకి వచ్చిన పంటల్లో అత్యధిక శాతం వరిపంటే సాగులోకి వచ్చింది. మిగిలిన ఆహారధాన్య పంటల్లో జొన్న 37725ఎకరాలు, సజ్జ 632 ఎకరాలు, మొక్కజొన్న 709758ఎకరాలు, రాగి 642ఎకరాలు, ఇతర చిరుధాన్య పంటలు 297ఎకరాల్లో సాగులోకి వచ్చాయి.
4.10లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్ కింద అన్ని రకాల నూనెగింజ పంటలు కలిపి 4.10లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. అందులో వేరుశనగ 28909ఎకరాలు, నువ్వులు 1542ఎకరాలు, పొద్దుతిరుగుడు 282ఎకరాలు, ఆముదం 5391 ఎకరాలు, సోయాబీన్ 3,74,487ఎకరాలు, ఇతర మరికొన్నినూనెగింజ పంట లు 368ఎకరాల్లో సాగు చేశారు. రాష్ట్రంలో నూనెగింజల సాధారణ సాగు విస్తీర్ణం 5.92లక్షల ఎకరాలు కాగా గత ఏడాది 4.61లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగు చేయగా 69.40శాతంలోనే సాగులోకి వచ్చాయి.
79.97శాతంలో పప్పుధాన్య పంటలు
రాష్ట్రంలో పప్పుధాన్య పంటల సాగు విస్తీర్ణం 79.97శాతం వద్దనే ఆగిపోయింది. అన్ని రకాల పప్పుధాన్య పంటలు కలిపి 9,05,501 ఎకరాల్లో సాగు చేశారు. ప్రధాన పంటల్లో కంది 7.64లక్షల ఎకరాలు, పెసర 88655ఎకరాలు, మినుము 47469ఎకరాలు, ఉలవ 980ఎకరాలు, ఇతర మరికొన్ని పప్పుధాన్య పంటలు 3738ఎకరాల్లో సాగు చేశారు.
46.42లక్షల ఎకరాల వద్దే ఆగిన పత్తి విస్తీర్ణం
రాష్ట్రంలో పత్తి సాగు వీస్తీర్ణం భారీగా పెరుగుతుందని ఆంచనా వేయగా ఈ పంట విస్తీర్ణం 97.53శాతం వద్దనే ఆగిపోయింది. రాష్ట్రంలో పత్తిసాగు సాధారణ విస్తీర్ణం 47.60లక్షల ఎకరాలు కాగా , గత ఏడాది 60.17లక్షల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఈ సారి పత్తిపంటను 46.42లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వాణిజ్య పంటల్లో ఇప్పటివరకూ 1397ఎకరాల్లో పొగాకు నాటేశారు. చెరకు పంట 51223ఎకరాలు , ఇతర మరికొన్ని వాణి జ్య పంటలు 13203ఎకరాల్లో సాగు చేశారు. రాష్ట్రంలో వానాకాలం అన్నిరకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 11663267 ఎకరాలు కాగా, ఈ సమయానికి 1,09,39,903ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సివుండగా, ఇప్పటివరకూ 1,29,68,933ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ఇదే సమాయానికి 1,34,23,626 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి.