Monday, December 23, 2024

ఎవరి దగ్గరకు వెళ్లొద్దు.. రాఘవేంద్ర రావు అనుచరుల బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

వెళ్తే బాగుండదు
బాధితులకు బెదరింపులు షురూ
రాష్ట్ర కాంగ్రెస్ నేత విహెచ్‌కు శోభారాణి అనే మహిళ ఫిర్యాదు

మనతెలంగాణ/కొత్తగూడెం : పాల్వంచలో ఇప్పుడు బెదిరింపుల పర్వం ప్రారంభమైంది. గతంలో వనమా రాఘవేంద్రరావు వల్ల అన్యాయానికి గురైన వాళ్లు మరెక్కడికి వెళ్లరాదని ఆయన అనుచరులు హుకుం జారీ చేస్తున్నారు. పాత పాల్వంచలో మండిగ రామకృష్ణ, ఆయన తల్లికి ఉన్న ఆస్తి గొడవల్లో రాఘవేంద్రరావు జోక్యం చేసుకుని తనకు ఆస్తి దక్కకుండా చేశాడని, ఆస్తి దక్కాలంటే తన వద్ద  భార్యను పంపమన్నాడని రామకృష్ణ సెల్పీవీడియో రికార్డు చేసి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య, ఇద్దరు పిల్లలను కూడా ఆగ్నికి ఆహుతి చేశారు. ఈ క్రమంలో వనమా రాఘవేంద్రరావు ను టిఆర్‌ఎస్ నుంచి బహిష్కరించటం, పోలీసులు ఎప్‌ఐఆర్ నమోదు చేయడం, రాఘవేంద్రరావు సబ్ జైలుకు రిమాండ్‌కు వెళ్లడంతో బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇలా చేయడానికి వీలు లేదని ఫిర్యాదు చేయవద్దని రాఘవేంద్ర రావు తాబేదార్లు, అనుచరులు కొందరిని బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

ఒక చోట అన్యాయం జరిగితే మరో చోటకు వెళ్లి చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు అలా వెళ్లడానికి వీలు లేదని, జరిగిన అన్యాయం కూడా అవకాశం ఉంటే తామే సరిచేస్తామని, ఎవరి వద్దకు వెళ్లవద్దని, పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వవద్దని బాధితులను పెద్ద ఎత్తున బెదిరిస్తున్నారు. తాజాగా సోమవారం పాల్వంచ వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు వద్ద ఇలా ఒక మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంటు లాక్కొని వనమా రాఘవేంద్రరావు అనుచరులు మేదర మెట్ల వెంకటేశ్వరరావు చింపివేశాడని, అప్పుడు దిక్కున్న కాడ చెప్పుకోమన్నాడని, రాఘవ అరెస్ట్ అనంతరం తాను ఈ విషయాన్ని ఆదివారం మీడియాకు చెప్పానని అయితే తనకు బెదిరింపులు ప్రారంభమయ్యాయని చావా శోభారాణి అనే మహిళ వాపోయింది.

తన తండ్రి వద్ద పాపినేని శ్రీనివాస్ అనే వ్యక్తి 42 లక్షలు రూపాయలు అప్పుగా తీసుకున్నాడని ఆ డబ్బులు ఇవ్వకపోతే తాము రాఘవేంద్రరావును ఆశ్రయిస్తే అక్కడే ఉన్న మేదరమెట్ట వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అయిదేళ్ల కిందట తమ వద్ద ఉన్న అసలు డాక్యుమెంటు లాక్కుని చింపివేశాడని చావా శోభారాణి వాపోయింది. తాము వనమా రాఘవేంద్రరావు కాళ్లు పట్టుకుని తమకు న్యాయం చేయాలని బతిమిలాడితే లాభం లేకపోయిందని చెప్పింది. కాగా ఆదివారం తాను మీడియాకు ఈ విషయాలు వెల్లడించనందుకు తనను మేదరమెట్ల వెంకటేశ్వరరావు బెదిరిస్తున్నాడని, తమకు ప్రాణ భయం ఉందని, తనను ఎవరి వద్దకు వెళ్లవద్దని హుకుం జారీ చేశాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె విహెచ్‌ను కోరింది. తాను ఇప్పుడు జిల్లా ఎస్పిని కలుస్తానని, ఈ విషయం కూడా ఎస్పి దృష్టికి తీసుకెళతానని శోభారాణికి విహెచ్ హామీ ఇచ్చారు. ఇలా వనమా అనుచరులు ఇప్పుడు కూడా పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దీన్ని పరిశీలించాలని కాంగ్రెస్ నాయకులు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా బాధితులు ఎవరైనా తన వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదులు ఇవ్వాలని పాల్వంచ ఎఎస్ పి రోహిత్ గతంలోనే ప్రకటించారు. ఎవరైనా తన వద్దకు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News