Saturday, November 16, 2024

వనస్థలిపురం దోపిడీ నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

అప్పుతీసుకున్న వారే నిందితులు
రూ.25లక్షలు దోచుకుని పరార్
అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
వివరాలు వెల్లడించిన సిపి డిఎస్ చౌహాన్

మనతెలంగాణ, సిటిబ్యూరోః వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దోపిడీ కేసులో నలుగురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.18లక్షల నగదు, బెంజ్‌కారు, బైక్, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు పాస్‌పోర్టు జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 6వతేదీన ఎంఆర్‌ఆర్ వైన్స్ యజమాని వెంకట్‌రెడ్డి రూ.50లక్షలు తీసుకుని తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగితో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.

బార్ నుంచి 200మీటర్లకు వెళ్లగానే కమాలానగర్, సాయిబాబా టెంపుల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌కు అడ్డుతగిలి రూ.25లక్షలు తీసుకుని పారిపోయారు. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేశారు. నగరంలోని భవానీనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ హమీద్ అలియాస్ నయిం, రహీం ఘోరీ, ఓమర్ బిన్ హమ్జా అల్ జాబ్రీ అలియాస్ ఒమర్, అలీబిన్ హంజా అలీ జాబ్రీ అలియాస్ అలీ, ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మన్ అలియాస్ ఫహద్ కలిసి డబ్బులు దోచుకున్నారు. మహ్మ ద్ అబ్దుల్ హమీద్ రిలేటివ్‌కు ఆటోనగర్‌లోని ఎంఆర్‌ఆర్ యజమాని వెంకట్‌రెడ్డి సన్నిహితుడు. దీంతో అబ్దుల్ హమీద్‌కు వెంకట్‌రెడ్డి వద్ద రూ.50లక్షలను అప్పుగా ఇప్పించాడు.

అప్పు తీసుకుని చాలారోజులు అవుతున్నా తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో వెంకట్ రెడ్డి ఒత్తిడి చేశాడు. దీంతో ప్రధాన నిందితుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, రహీం ఘోరీ మిగతా వారితో కలిసి దోపిడీకి ప్లాన్ వేశాడు. డబ్బులు వెంకట్‌రెడ్డికి ఇచ్చిన తర్వాత అతడు డబ్బులు తీసుకుని వెళ్తుండగా దోచుకోవాలని ప్లాన్ వేశారు. దానికి నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించారు. ప్లాన్‌లో భాగంగా ప్రధాన నిందితుడు మహ్మద్ అబ్దుల్ వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసి పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. దాని ప్రకారమే ఈ నెల 6వ తేదీన వెంకట్‌రెడ్డికి రూ.50లక్షలు ఎంఆర్‌ఆర్ బార్‌లో ఇచ్చాడు. వాటిని తీసుకున్న వెంకట్ రెడ్డి బ్యాగులో డబ్బులు పెట్టుకుని తన వద్ద పనిచేసే ఉద్యోగితో కలిసి బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. ప్లాన్‌లో భాగంగా వీరిని రహీం ఘోరీ, ఓమర్ ఫాలో అయ్యారు.

కొద్ది దూరం వెళ్లగానే వారి బైక్‌కు అడ్డం పెట్టి వారి వద్ద ఉన్న మొత్తం డబ్బులను దోచుకునేందుకు యత్నించారు. కానీ అప్పటికే స్థానికులు గుమ్మిగూడగా చేతికి అందిన రూ.25లక్షలను దోచుకుని పారిపోయారు. వాటిని తీసుకుని వెళ్లి మహ్మద్ అబ్దుల్‌కు ఇచ్చారు. వాటిలో నుంచి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఇచ్చాడు. ఈ క్రమంలోనే దేశం నుంచి పారిపోవాలని ప్లాన్ వేసిన రహీం ఘోరీ, ఒమర్ బిన్ హమ్జా అల్ జాబ్రీ అలియాస్ ఒమర్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మన్‌కు లక్ష రూపాయలు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, సిసిసిఎస్, వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, రాములు, యాదయ్య, ఎవి రంగా, అర్జునయ్య, మన్‌మోహన్, అశోక్‌కుమార్, సైదులు, రవికుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News