కాచిగూడ టు బెంగుళూరు, సికింద్రాబాద్ టు ఫుణే,
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి?
ఆయా రైల్వే లైన్ల పరిధిలో నెట్‌వర్క్‌ను
అప్‌గ్రేడ్ చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేటాయించాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించినట్టుగా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సికింద్రాబాద్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు సికింద్రాబాద్ వరకు ఈనెల 16వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆక్యుఫెన్సీ 100 నుంచి 140 శాతంగా నమోదు కావడంతో మరికొన్ని మార్గాల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణమధ్య రైల్వే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు విన్నవించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే శాఖ దీనికి అంగీకారం తెలపడంతో త్వరలోనే ఏయే రూట్లతో ఈ రైళ్లను నడపాలన్న దానిపై దక్షిణమధ్య రైల్వే అధికా రులతో చర్చించనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆక్యుఫెన్సీ, ఆదాయంపై కూడా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు ఒక నివేదికను దక్షిణమధ్య రైల్వేఅధికారులు అందచేసినట్టుగా సమాచారం.
వ్యాపారపరమైన సంబంధాలు
సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఇది ఆగుతున్నా ప్రయాణికుల ఆక్యుఫెన్సీ అంతకంతకు పెరగడం దక్షిణమధ్య రైల్వేకు కలిసివచ్చే అంశమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకునే సరికి 8 గంటల నుంచి 8.30 గంటల సమ యం పడుతోంది. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్‌గా హైదరాబాద్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఈ రైలును అధికంగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో వ్యాపారపరమైన సంబంధాలు, అభివృద్ధి సాధించిన పట్టణాలకు కొత్త వందేభారత్ రైళ్లను నడిపితే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
బెంగుళూరు, ఫుణే, తిరుపతి పట్టణాలకు అయితే ఈ మూడు రైళ్లను స్మార్ట్ సిటీలు అయిన బెంగుళూరు, ఫుణే నగరంతో పాటు తిరుపతికి నడిపే అవకాశం ఉన్నట్టుగా అధికారిక వర్గాల సమాచారం. ఒకవేళ ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే వాటిని హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్ నుంచి బెంగుళూరుకు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఫుణేకు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతికి నడిపే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఆయా రైల్వే లైన్ల పరిధిలో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో దక్షిణ మధ్య రైల్వే నిమగ్నమైంది.
ఈ మార్గాల్లో గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపనున్నారు. రానున్న రోజుల్లో వేగాన్ని సైతం పెంచడంతో పాటు ట్రాక్‌ల సామర్ధాన్ని పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
ప్రధాన కోచ్ డిపో ఏర్పాటుకు కసరత్తు కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తే సికింద్రాబాద్, విజయవాడ డివిజన్‌లో కనీసం ఒక ప్రధాన కోచ్ డిపోను ఏర్పాటు చేయాలని కేంద్రం దక్షిణమధ్య రైల్వేకు సూచించినట్టుగా తెలిసింది. వీటితో పాటు ఇతర కార్యకలాపాల కోసం ఆయా డివిజన్ల పరిధిలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్రం నుంచి దక్షిణమధ్య రైల్వే అధికారులకు సూచనలు అందినట్టుగా తెలిసింది. వీటిని నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న డిపోలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఆ తర్వాత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది.
ఈ ఏడాది చివరినాటికి 75 రైళ్లు
గతేడాది వందే భారత్ ప్రాజెక్టును ప్రవేశపెట్టగా ప్రస్తుతానికి నాగ్‌పూర్ టు- బిలాస్‌పూర్, ఢిల్లీ- టు వారణాసి, గాంధీనగర్- టు ముంబై, చెన్నై- టు మైసూర్, సికింద్రాబాద్- టు వైజాగ్‌తో సహా పలు మార్గాల్లో ఎనిమిది వరకు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరినాటికి మరో 75 రైళ్లతో పాటు రాబోయే మూడు సంవత్సరాల్లో 400 వందే భారత్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారతీయ రైల్వే శాఖ యోచిస్తోంది.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇప్పటికే చెన్నైలోని పెరంబూర్‌లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైళ్లను తయారు చేస్తుండగా మార్కెట్, ఇతర అంశాల దృష్ట్యా 400 కొత్త తరం వందేభారత్ రైళ్లలో కొన్నింటిని హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తయారు చేసే అవకాశం ఉందని రైల్వేఅధికారులు పేర్కొంటున్నారు.
స్వదేశీ సాంకేతికతతో ఈ రైలులో 14 ఏసి చైర్ కార్ కోచ్‌లు (1024 సీట్లు ) 02 ఎగ్జిక్యూటివ్ ఎసి చైర్ కార్ కోచ్‌లు (104 సీట్లు) మొత్తం 1128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఆధునిక హంగులతో, విమాన తరహా పయాణం అనుభూతిని పొందే విధంగా మెరుగైన సౌకర్యాలతో ఈ రైలును తయారు చేశారు. ఈ రైలులో తలుపులు వాటి అంతటా అవే తెరుచుకోవడం, మూసుకునే విధంగా ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌ల వ్యవస్థను కలిగి ఉంది. అన్ని తరగతులలో ఏటవాలు సీట్లు ఉండగా ఎగ్జిక్యూటివ్ తరగతిలో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లను అమర్చారు.