Thursday, January 23, 2025

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

భోపాల్ : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ రైల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు అప్రమత్తతతోఎలాంటి ప్రమాదం జరగలేదు. రాణి కమలాపతి హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ రైలు సోమవారం తెల్లవారు జామున 5.40 గంటల ప్రాంతంలో భోపాల్ నుంచి బయల్దేరింది. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో సీ12 బోగీ చక్రాల్లో నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే రైలును విదిశ జిల్లా లోని కుర్వాయ్‌కేథోరా స్టేషన్ల మధ్య నిలిపివేసి తనిఖీ చేయగా, బ్యాటరీ బాక్సుల్లో మంటలు చెలరేగినట్టు తెలిసింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే ప్రయాణికులను దించేశారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, మంటలు బ్యాటరీ బాక్స్‌కు మాత్రమే పరిమితమయ్యాయని , వాటిని పూర్తిగా అదుపు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది రైలుకు మరమ్మతులు చేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతిక తనిఖీలు పూర్తి చేసిన అనంతరం రైలు ఢిల్లీ బయల్దేరుతుందని చెప్పారు. ప్రమాద సమయంలో సీ12 బోగీలో 36 మంది ప్రయాణికులున్నారు. మధ్యప్రదేశ్‌లో అందుబాటు లోకి వచ్చిన మొదటి వందే భారత్ రైలు ఇదే. ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దీన్ని ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News