Sunday, January 19, 2025

‘వందే భారత్’లో వంద అబద్ధాలు

- Advertisement -
- Advertisement -

వందే భారత్ భారత్ అంటూ 130 కిలోమీటర్ల వేగంతో అత్యంత ఫాస్ట్‌గా గమ్యానికి చేరుస్తుందంటూ రైల్వే శాఖ ప్రకటించింది. దేశ ప్రధాన మంత్రితో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ అందరూ పండగవేళ ఒక రైలు గురించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజమైన పండగ వచ్చిందని ప్రధానమంత్రి అభివర్ణించారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమిటంటే సామాన్యులకు అందుబాటులో లేని ధరలతో కొత్త వందే భారత్ ఎవరికి ఉపయోగం? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 905 రూపాయల ఛార్జీ ఉంది. సాధారణంగా సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దీని ధర 172 రూపాయలు గానే ఉండి గమ్యస్థానానికి ఆరు గంటల్లో చేరుస్తోంది. వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నాలుగు గంటల సమయం పడుతోంది. ఇతర రైళ్లకు, వందే భారత్‌కు తేడా కేవలం రెండు గంటలు మాత్రమే. ఆ రెండు గంటల సమయం కోసం అదనంగా 725 రూపాయలు ఖర్చుపెట్టడం అవసరమా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.

కేవలం వందే భారత్ అనేది రైలు లోపల ఇంటీరియర్ డెకరేషన్ బాగున్నంత మాత్రాన అంత వెచ్చించగలిగే ధనవంతుల కోసమే ఇది ప్రవేశపెట్టినట్టినట్లుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో విమానం స్థాయిలో సదుపాయాలు ఉన్నాయని ఊదరగొట్టినప్పటికీ ప్రయాణికుల నుంచి ఆశించినంత స్పందన కానరావడం లేదు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు నడిపే సూపర్ ఫాస్ట్ రైళ్లలో దురంతో ఎక్స్‌ప్రెస్ అతి ముఖ్యమైనది. దీనిలో ఫస్ట్ ఎసి, సెకండ్ ఎసి, థర్డ్ ఎసి కోచ్‌లు ఉంటాయి. అన్నీ స్లీపర్ బెర్తులే. దురంతోలో ఫస్ట్ ఎసి టికెట్ ధర 2,800 రూపాయలు, సెకండ్ ఎసి 2,300 రూపాయలు, థర్డ్ ఎసి 1,630 రూపాయలుగా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ కూడా గంటకు 130 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు 10 గంటల 10 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది. ఇక వందే భారత్ రైలు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు 3,170 రూపాయలుగా ఉంది. గంటకు 180 కిలోమీటర్ల మేర ప్రయాణించే సత్తా ఉన్నా మన రూట్‌లో మాత్రం 130 కిలోమీటర్ల వేగ పరిమితిని విధించారు. ఇందులో స్లీపర్ బెర్తులు ఉండవు. అన్నీ చైర్ సీటింగ్ మాత్రమే ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి 8.30 గంటల ప్రయాణంతో విశాఖకు చేరుకోవచ్చు.

దురంతో తో పోల్చుకుంటే గంటా 40 నిమిషాలు ముందుగా వందే భారత్‌లో ప్రయాణించవచ్చు. ఇవన్నీ చూసిన తర్వా త సగటు ప్రయాణికుడు వందే భారత్ కంటే దురంతో వైపే ఆసక్తి చూపిస్తున్నారు. గంటన్నర వ్యత్యాసానికి అంత డబ్బు చెల్లించి వందే భారత్‌లో వెళ్లే కంటే ఇతర సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించడం మేలని భావిస్తున్నారు. వందే భారత్‌లో 1,128 సీటింగ్‌కు కాను 1,050 సీట్లు చైర్‌కార్ సదుపాయంతో ఉన్నాయి. మిగిలినవి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు కేటాయించారు. వందే భారత్ రైలులో ప్యాంట్రీ కార్ లేదు. అయినా ఆహారం ఇస్తామంటూ ముందుగానే టికెట్‌తో కలిసి డబ్బులు తీసుకుంటున్నారు.ఎగ్జిక్యూటివ్ క్లాసులో ఏకంగా 400 రూపాయలు వరకు చార్జీ చేస్తున్నారు. ఈ రైలులో ఆహార పదార్థాలను వేడి చేసుకునే సదుపాయం తప్పితే కనీసం కాఫీ పెట్టడానికి కూడా ఏర్పాట్లు లేవు. విశాఖలో ఈ రైలు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. విశాఖ నుంచి ఈ రైలు బయలుదేరే సమయం అందరికీ అనుకూలంగా ఉంది. అయితే సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకునే సరికి రాత్రి 11 గంటల 30 నిమిషాలు అవుతోంది. అర్ధరాత్రి స్టేషన్‌లో దిగి ఆటో, టాక్సీలో ఇంటికి వెళ్లాలంటే భద్రతాపరమైన సమస్యలు ఉంటాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ల రేట్లు వింటేనే గుండె గుభేల్ మంటోంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి పది రోజుల ముందు బుక్ చేసుకుంటే విమానం టికెట్ 3,900 రూపాయలకే లభిస్తుంది. ప్రయాణ సమయం గంట మాత్రమే. అదే వందే భారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్‌కి 3,170 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రయాణ సమయం 8.30 గంట లు. ఇంకో 700 రూపాయలు అదనంగా పెడితే విమానం ఎక్కి ఏకంగా ఏడు గంటల సమయం ఆదా చేసుకోవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైలు గూర్చి సొల్లు ప్రచారం ఆపాలి. 1988లో ప్రవేశపెట్టిన శతాబ్ది ఎక్స్రెప్రెస్ దాని గరిష్ఠ వేగం గంటకు 110 నుంచి 150 కిలోమీటర్లు అయితే ఆచరణలో గరిష్ఠ వేగం 98 కిలోమీటర్లు మాత్రమే. ఆ తర్వాత 2016లో గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. దాని గరిష్ఠ వేగం 110 నుంచి 160 కిలోమీటర్లు అయితే ఆచరణలో అది కూడా 90 కిలోమీటర్లే. ఇప్పుడు నూతనంగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా 2019లోనే ప్రవేశపెట్టారు. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాలకు రావడానికి నాలుగేళ్లు పట్టింది.

సామాన్యుడు దీంట్లో ప్రయాణం చేయలేడు సరిగదా కనీసం ఊహించను కూడా ఊహించ లేడు. మామూలు ఎక్స్‌ప్రెస్ రేటు కంటే దీనిని ధర మూడు రెట్లు కంటే ఎక్కువగా ఉన్నది. రాజమండ్రి నుండి సికింద్రాబాద్‌కు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ బెర్త్ 325 రూపాయలు, వందే భారత్ రైలులో 1425 రూపాయలు. అందులో 350 రూపాయలు భోజన ఖర్చు. సామాన్యుడు ఎవరు దీనిని భరించలేడు. గౌతమి ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణ సమయం 8 గంటల 25 నిమిషాలు వందేభారత్‌లో కేవలం రెండు గంటలే 6 గంటల18 నిమిషాలకు ముందుగా తీసుకెళ్తుంది. మరి ఈ మాత్రం దానికి అంత భయంకరమైన రేటు పెట్టాలా. ఇంత సొల్లు ప్రచారం చేయాలా.

ఇకపోతే స్వదేశీ పరిజ్ఞానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు, సిగ్గు లేకపోతే సరి. స్వదేశీ పరిజ్ఞానాన్ని, ప్రయోగాలని పూర్తిగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వమే. ఆఖరికి విగ్రహాలు తయారు చేయడానికి కూడా పక్కనున్న దేశాలకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. రామానుజాచార్యుల విగ్రహం ఈ దేశంలో తయా రు చెయ్యగలం, పటేల్ విగ్రహాన్ని తయారు చేయగలం, కానీ రెండింటినీ పక్క దేశంలోనే తయారు చేసింది. చెప్పేవి మాత్రం స్వదేశీ కబుర్లు. తెలుగు రాష్ట్రాల మీదుగా వంద రైళ్లు పైగా ప్రయాణిస్తున్నాయి. అందులో వందే భారత్ రైలు కేవలం ఒక్కటే. అది కూడా ఇతర దేశాల్లో గంటకు ఈజిప్టు 230 కిలోమీటర్లు, మొరాకో 320 కిలోమీటర్లు, జపాన్ 374 కిలోమీటర్లు, ఫ్రాన్స్ 357 కిలోమీటర్లు, స్పెయిన్ 400 కిలోమీటర్లు, చైనా 420 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైళ్ళను ఉపయోగిస్తుంటే మనం గంటకు 300 నుండి 400 కిలోమీటర్ల వేగాన్ని ఎప్పటికి చేరుకుంటాం? ఒకవేళ చేరుకుంటే సామాన్యుడు ప్రయాణించగలడా? కాబట్టి ఇప్పటికయినా అదానీ అభివృద్ధి, అంబానీ అభివృద్ధి గురించి, కార్పొరేట్ల అభివృద్ధి గురించి కాదు, దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్లగలం.

యం.ఎ.జబ్బార్
9177264832

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News