Friday, November 22, 2024

ఆధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి…

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా 34కు చేరిన రైళ్ల సంఖ్య
రానున్న రెండు నెలల్లో మరో 9 రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి…

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించిన 9 రైళ్లలో గతంలో ప్రారంభించిన వందేభారత్ కన్నా మెరుగైన, ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో వాటిలో మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించేలా కేంద్ర రైల్వే శాఖ పలు సంస్కరణలను తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ఆదివారం ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్ల సంఖ్య 34కు చేరింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఒక రైలు కాషాయ రంగులో (కాసర్ గోడ్ – తిరువనంతపురం మార్గంలో తిరుగుతుండగా), మిగిలిన రైళ్లు నీలం రంగులో ఉన్నాయి. రాబోయే రెండు నెలల్లో మరో 9 కాషాయ రంగు వందే భారత్ రైళ్లను కేంద్ర రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే కొత్తగా ప్రారంభించిన 9 రైళ్లలో కొన్ని ఫీచర్లను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్
1.ప్రస్తుతం ప్రధాని మోడీ కొత్తగా ప్రారంభించిన వందే భారత్ కోచ్‌లో సీటు రిక్లైనింగ్ యాంగిల్ 17.31 డిగ్రీల నుంచి 19.37 డిగ్రీలను పెంచారు. దానివల్ల ప్యాసింజర్లు తమ సీట్లను మరింత వెనక్కి జరిపి సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
2.ప్రయాణికులు కూర్చునే సీట్ల కుషన్ గట్టిగా ఉందన్న విమర్శల నేపథ్యంలో కొత్త కోచ్‌లో మొత్తటి కుషన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూ రంగుకు మార్చడంతో పాటు, ఫుట్‌రెస్ట్‌ను మరింత పొడిగించారు.
3.కొత్తగా సీట్ల వెనుక మ్యాగజైన్ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్ ఛార్జింగ్ కోసం సీట్ల కింద ఏర్పాటు చేసిన
ఛార్జింగ్ పాయింట్లను సులువుగా యాక్సెస్ చేసేలా వాటిలో మార్పులు చేశారు.
4.ఇవే కాకుండా టాయిలెట్లో మెరుగైన లైటింగ్ కోసం 15 వాట్ బల్బుల స్థానంలో 2.5 వాట్ బల్బులను అమర్చారు. వాష్ బేషన్‌లో చేతులు కడిగే సమయంలో నీళ్లు బేసిన్ నుంచి బయటికి రాకుండా వాటి సైజును పెంచారు.
5.ప్రయాణికుల సౌకర్యంగా ఉండేలా వాటర్ ట్యాప్‌లు, టాయిలెట్ హ్యాండిల్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు.
6.దివ్యాంగుల వీల్‌చైర్లను భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేశారు.
7.ప్రయాణికులకు మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కోసం ఎయిర్‌లైట్ ప్యానల్‌లో మార్పులు చేశారు. దాంతోపాటు లగేజ్ ర్యాక్ లైట్లకు గతంలో కంటే మరింత మృదువైన టచ్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేశారు.
8.కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News