Monday, December 23, 2024

బాపు రమణలు గొడవపడిన వేళ.. ఏం జరిగిందో తెలుసా ?

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే ముళ్లపూడి వెంకట రమణ రెండు సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆయనకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్‌కు కుడి భుజంగా ఉండే పుహలేంది చనిపోయినప్పుడు ముళ్లపూడి తట్టుకోలేకపోయారట. సొంత సోదరుడిని కోల్పోయినట్లు బాధపడ్డారట. ఆయన పడుతున్న వేదనను చూసి ఆయన కుమారుడు వర ముళ్లపూడి కూడా భయపడ్డారట.

రెండో సందర్భం…‘కోతి కొమ్మచ్చి’పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. బాపురమణలకి సన్మానం జరిగినప్పుడు ఆడిటోరియం మొత్తం లేచి నిలుచుని చప్పట్లు కొట్టినప్పుడు ముళ్లపూడి కళ్లలో నీళ్లు కనిపించాయట. ఈ విషయాలను వర ముళ్లపూడి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బాపు రమణల స్నేహబంధం. ఇద్దరికీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఒకళ్లకి ఒకళ్లు బ్యాక్‌గ్రౌండ్ అయ్యారు. ముళ్లపూడి ఇంట్లో పది మంది ఉండేవాళ్లు. పైన బాపు ఇంట్లో ఐదుగురు మొత్తం 15 మంది. ఇల్లంతా గోలగోలగా ఉండేది. ముళ్లపూడి భోజనప్రియులు, తినడమే కాదు తినిపించడంలో కూడా బోలెడంత ఆనందం పొందేవారు ఆయన. చిన్న వంక దొరికితే చాలు తమ ఆస్థాన వంటవాళ్లని పిలిపించి భోజనాలు పెట్టించేసేవారు. పక్కనే నిలుచుని అన్నీ చూసుకునేవారు. షూటింగుల్లో కూడా అంతేనట.

ఒకసారి ఒక తమాషా సంఘటన జరిగిందిట. 198689 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం స్కూలు పాఠాలు ఆడియో విజువల్ చేస్తున్నప్పుడు రాజమండ్రిలో షూటింగ్ పెట్టారు. యూనిట్ అందరినీ రైల్లో ఫస్ట్ క్లాస్‌లో రాజమండ్రి తీసుకెళ్లారు. భోజనాల వేళ వడ్డనలు జరుగుతున్నాయి. ఒక లైట్‌మ్యాన్ కడుపు నిండా భోంచేసి చేతులు కడుక్కుంటూ అక్కడే ఉన్న శ్రీరమణగారితో, “సార్ వడ్డించడానికి కొంచెం కుర్రాళ్లని పెట్టుకోవచ్చుగా.. ఆ పెద్దాయనను చూడండి. ఎలా అవస్థపడుతున్నారో” అన్నాడు. శ్రీరమణగారు ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి చూసి ఉలిక్కిపడ్డారు. ఎవరా పెద్దాయన అని చూస్తే తలకు తువ్వాలు చుట్టుకుని లుంగీ పైకి ఎగ్గట్టుకుని అన్నం వడ్డిస్తున్న నానరమణగారు కనిపించారు. “భలేవాడివయ్యా బాబు! ఆయన ఎవరనుకున్నావు? ఆయనే నిర్మాత” అనేసరికి ఆ లైట్‌మ్యాన్ వెయ్యివోల్టుల కరెంట్ షాక్ కొట్టినట్లు కొయ్యబారిపోయాడట.

రమణగారికి గోదావరి అంటే ప్రాణం. ఆ పేరు చెప్తే పూనకం వచ్చేసేది. బాపు రమణలు తీసిన సినిమాల్లో ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. షూటింగ్ లొకేషన్లు చూడడానికి తరచు రమణ, రచయిత శ్రీరమణ. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ కెవి. రావు రైల్లో రాజమండ్రికి వెళ్లేవారు. బాపుగారు అప్పుడప్పుడు వీళ్లతో వెళ్లేవారు. వీళ్ల ప్రయాణమంటే ఇంట్లో వాళ్లకే హడావుడి ఎక్కువగా ఉండేదట.

భోజనాలను కేరేజ్‌లో సర్దడానికి నానాహైరానా పడేవాళ్లు. ఇంట్లో ఒక పెద్ద రేకు డబ్బా ఉండేది. రైల్లో తీసికెళ్లడం కోసమే దీన్ని ప్రత్యేకంగా చేయించారు. దాంట్లో నాలుగు భోజనం ప్లేట్లు, నాలుగు టిఫిన్ ప్లేట్లు, గరిటెలు, చెంచాలు, నాలుగు గిన్నెల క్యారేజ్..వీటితో పాటు కాగితాలతో చుట్టిన నాలుగు గ్లాసులు వగైరాలు ఉండేవి. రమణగారి మాటల్లో అది ‘మందోబస్తు’.
ఆరోజుల్లో ఎసి కంపార్ట్‌మెంట్లు లేవు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ మాత్రమే ఉండేది. ఒక్కో క్యాబిన్‌లో నాలుగు బెర్త్‌లు. ముగ్గురే వెళ్లవలసి వచ్చినా నాలుగు టికెట్లు బుక్ చేసేవారు. ఒకసారి వీళ్లు ముగ్గురే ప్రయాణం చేస్తున్నారు. రేకు డబ్బాలో నలుగురికి సరిపడా భోజనం ఉంది. ‘ముగ్గురికి అంత భోజనం ఎందుకు?”అని ఇంట్లో వాళ్లడిగితే. క్యాబిన్‌లో నాలుగో మనిషి ఉన్నాడనుకో ఆయన తిండి తెచ్చుకోలేదనుకో.. రాత్రి వేళ ఇబ్బంది పడతాడు కదా పాపం”అనేవారట రమణగారు.

బాపు రమణలకు ఒకరంటే ఒకరికి పిచ్చిప్రేమ. అలాగని వాళ్లిద్దరూ ఎప్పుడూ కలహించుకోరని కాదు. వాళ్లిద్దరూ వాదించుకోవడం, కాస్సేపు మాట్లాడుకోకపోవడం.. ఆ తర్వాత కలసిపోవడం మామూలేనట. అయితే ఒకసారి మాత్రం వీళ్లిద్దరూ జీవితంలో మళ్లీ కలుసుకుంటారా అన్నంత భయంకరంగా గొడవపడ్డారట. హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ కోసం మద్రాసు నుంచి బాపు, రమణలతోపాటు వర ముళ్లపూడి కూడా వచ్చారట. స్టూడియోలో షూటింగ్. బాపుగారు డైరెక్టర్, వర ఆయన అసిస్టెంట్ , ఇంకో అసిస్టెంట్‌గా ఇప్పుడు దర్శకుడిగా మారిన గాంధీ ఉన్నారు. వర, గాంధీ స్టూడియో నుంచి ఆలస్యంగా రాత్రి పదింటికి గెస్ట్ హౌస్ చేరుకున్నారు దూరం నుంచే పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. గేటులో నుంచి తొంగి చూస్తే వసారాలో కుర్చీల్లో కూర్చుని బాపు రమణలు గట్టిగా అరుచుకుంటున్నారు.

అది చూసి వర, గాంధీ హడలిపోయారు. ఎప్పట్లా లేవా అరుపులు, “ ఇక అంతా అయిపోయింది. వీళ్లిద్దరూ విడిపోవడం ఖాయం’ అనుకుని లోపలకు వెళ్లడానికి కూడా భయమేసి అట్నుంచి అటే రోడ్డు మీదకు వెళ్లిపోయారు వీళ్లిద్దరూ. అలా రాత్రి 11.30 దాకా బయటే తచ్చాడి ఇక ఆకలికి తట్టుకోలేక, ఏం చూడాల్సివస్తుందో అనుకుని బిక్కుబిక్కుమంటూ గెస్ట్‌హౌస్ లోపలకు వెళ్లారు. అక్కడంతా నిశబ్దం. ఎక్కడా చడీచప్పుడూ లేదు.

ఇద్దరూ నిద్రపోతున్నారు. వీళ్లూ పడుకున్నారు. మర్నాడు పొద్దునే ఏం చూడాలో, ఏం వినాలో అని భయపడుతూ బయటకు వచ్చారు వర, గాంధీ. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వీరిద్దరికీ నోట మాట రాలేదు. బాపు రమణలు కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. రమణకు బాపు వడ్డిస్తుంటే..‘ ఈ చట్నీ తిను బావుంది.” అంటూ బాపుకు రమణ తిరిగి వడ్డిస్తున్నారు. అలా ఉంటుంది వాళ్లిద్దరి స్నేహబంధం అంటూ బాపు రమణల స్నేహం గురించి వివరించారు వర ముళ్లపూడి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News