వారం రోజుల పాటు దారుణం
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 22 మంది నిందితులు ఓ 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు వారం రోజులపాటు ఆ యువతిపై అతాచారం చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకోడానికి పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తర వారణాసిలోని లాల్‌పుర్‌కు చెందిన ఆ టీనేజర్ యువతి తన ఫ్రెండ్‌ను చూసేందుకు మార్చి 29న ఇంటి నుంచి బయల్దేరింది. ఇదివరలో ఆమె ఒంటరిగానే సురక్షితంగా వెళ్లివచ్చేది. కానీ ఆ రోజున మాత్రం ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఏప్రిల్ 4న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే రోజున కిడ్నాపర్లు ఆమెకు మత్తుమందు ఇచ్చి పండేపూర్ కూడలిలో వదిలిపెట్టారు. ఆమె సమీపంలోనే ఉన్న ఫ్రెండ్ ఇంటికి ఎలాగోలా చేరుకుంది. తర్వాత వారు ఆమెను ఇంటికి చేర్చారు. తనపై జరిగిన దారుణాన్ని ఆ యువతి తండ్రికి తెలుపగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్లు ఆమెను అనేక చోట్లకు తీసుకెళ్లి లైంగికంగా దాడికి పాల్పడ్డారని ఆ యువతి తెలిపినట్లు తెలుస్తోంది.
ఆమెపై హుక్కా బార్‌లో, హోటల్‌లో, లాడ్జ్‌లో , గెస్ట్‌హౌస్‌లో…ఇలా పలు ప్రాంతాల్లో 22 మంది బలాత్కరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని అదే రోజు రాత్రి హుకుల్ గంజ్, లల్లాపుర ప్రాంతాలకు చెందిన అనేక మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరు మైనర్లు ఉన్నారని సమాచారం. అయితే పోలీసులు పూర్తి వివరాలు తెలుపడంలేదు. లైంగిక దాడి జరిగిందని మొదట్లో బాధితురాలుగానీ, ఆమె కుటుంబసభ్యులుగాని తెలుపలేదని, కానీ చివరికి లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేశారని స్థానిక సీనియర్ పోలీస్ అధికారి చంద్రకాంత్ మీనా తెలిపారు. బలాత్కారం ఫిర్యాదు ఏప్రిల్ 6న దాఖలయిందని కూడా ఆయన తెలిపారు.